బోగీల్లో వసతులు లేక ఇబ్బంది పడిన నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు రైల్వే అధికారుల తీరుపై మండిపడ్డారు.
గూడూరు: రిజర్వేషన్ బోగీల్లో వసతులు లేక ఇబ్బంది పడిన నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు రైల్వే అధికారుల తీరుపై మండిపడ్డారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రైల్వేస్టేషన్‌లో సుమారు గంటన్నర పాటు రైలును స్టేషన్‌లో నిలిపి ఆందోళన చేపట్టారు. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ఉదయం 6.45 గంటలకు బయలు దేరింది. ఈ రైల్లోని ఎస్-6, ఎస్-7 బోగీల్లో కరెంట్ లేకపోవడంతో, ఫ్యాన్లు తిరగలేదు. సోమవారం మధ్యాహ్నం ఆలస్యంగా 3.30 గంటలకు చేరుకుంది.
దీంతో బోగీల్లోని సమస్యలను గార్డుకు వివరించబోగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైలు బయలుదేరుతుండగా చైన్ లాగి ఆపివేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. సుమారు గంటన్నర పాటు రైలు గూడూరు స్టేషన్‌లో నిలిచిపోయింది. రంగంలోకి దిగిన అధికారులు బోగీలకు నీటిని నింపి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో రైలు బయలుదేరి చెన్నెకు వెళ్లింది.