
జైలు.. అమ్మ.. చిన్నారి
మాతృమూర్తి చేసిన నేరం ఆ చిన్నారిని జైలులో ఉండేలా చేసింది.
జగిత్యాల : మాతృమూర్తి చేసిన నేరం ఆ చిన్నారిని జైలులో ఉండేలా చేసింది. 14 రోజులుగా జైలు గోడలమధ్య అమ్మతో కాలం వెళ్లదీస్తోంది. తల్లిలేక ఉండలేని ఆ బిడ్డకు జైలు సిబ్బంది ఆడిస్తూ లాలిస్తూ సంబరపడుతున్నారు.
జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నాగసముద్రపు రాజశేఖర్(30) వండంగ్రి. ఈయనకు నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన మమతతో వివాహమైంది. వీరికి 20 నెలల కూతురు శ్రీనిధి ఉంది. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలూ జరిగాయి. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. 2015 డిసెంబర్ 10న రాజశేఖర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
‘తన చావుకు భార్య సహా అత్తింటివారే కారణం’ అని సూసైడ్ నోట్ రాశాడు. అప్పుడు రాజశేఖర్ కుటుంబ సభ్యులు భార్య మమతతో పాటు అత్తింటివారిపై పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం గత నెల 30న మమతను అరెస్టు చేసి జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో మమత జగిత్యాల స్పెషల్ జైలులో గడుపుతోంది.
తల్లితో కూతురు..
జైలులో ఉంటున్న మమత వెంట కూతురు శ్రీనిధి (20 నెలలు) ఉంటోంది. పాలుతాగే వయస్సు కావడంతో తల్లితోపాటు కూతురును జైలులో ఉండేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో 14 రోజులుగా చిన్నారి శ్రీనిధి జైలులో గడుపుతోంది. మహిళా ఖైదీలు అమ్మమ్మలు, నానమ్మలుగా మారి చిన్నారికి స్నానం చేయించడం.. అన్నం తినిపించడం, ఆటలాడించడం చేస్తూ అమ్మకు ఆసరా, చిన్నారికి భరోసా ఇస్తున్నారు.
జైలు సిబ్బంది మానతా దృక్పథం..
జైలు సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ఆమెను ఆడిస్తున్నారు. నవిస్తూ ముచ్చటపడుతున్నారు. చాకెట్లు, బిస్కెట్లు ఇస్తూ ప్రేమను పంచుతున్నారు. దీంతో శ్రీనిధి అమ్మకంటే జైలు సిబ్బంది వద్దే ఎక్కువ సమయం గడుపుతోంది.
చిన్నారికి ఎలాంటి అనారోగ్యం లేకున్నప్పటికీ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వారం రోజులకోసారి ఆసుపత్రికి తరలించి సిబ్బంది చికిత్సలు చేయిస్తున్నారు. బిడ్డను చూసినప్పుడల్లా తల్లి మమత కళ్లలో కన్నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. ‘నేను నేరం చేశానో, చేయలేదో దేవుడికి తెలుసు, కానీ.. ఏ నేరం చేయని బిడ్డ నాతో జైలు జీవితం అనుభవించడమే నాకు పెద్ద శిక్ష’ అంటూ కన్నీళ్ల పర్యంతమవుతోంది.