కాటేసిన కట్న పిశాచి! | Married woman suspicious death | Sakshi
Sakshi News home page

కాటేసిన కట్న పిశాచి!

Sep 12 2017 12:34 PM | Updated on Jul 30 2018 8:37 PM

పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న బింగోళి గ్రామస్తులు ( అర్చన మృతదేహం) - Sakshi

పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న బింగోళి గ్రామస్తులు ( అర్చన మృతదేహం)

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చెరువులో మృతదేహామై తేలింది. అయితే, అదనపు కట్నం కోసం భర్తే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీ కరిస్తున్నాడని..

వివాహిత అనుమానాస్పద మృతి
చెరువులో తేలిన మృతదేహం
కట్నం కోసం కొట్టి చంపారన్న బంధువులు
మద్నూర్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళన  


మద్నూర్‌(జుక్కల్‌) :
ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చెరువులో మృతదేహామై తేలింది. అయితే, అదనపు కట్నం కోసం భర్తే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీ కరిస్తున్నాడని పుట్టింటి వారు ఆందోళనకు దిగారు. దీంతో సోమవారం మద్నూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాన్సువాడ డీఎస్పీ నరసింహరావు కథ నం ప్రకారం.. జుక్కల్‌ మండలంలోని నాగుల్‌గావ్‌ గ్రామానికి చెందిన బిరాదర్‌ సంతోష్‌కు, మహారాష్ట్రలోని ముఖేడ్‌ తాలూకా బింగోళికి చెందిన అర్చన (20)తో గత ఏప్రిల్‌ 17న వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొద్ది రోజుల నుంచి సంతోష్, అత్తామామలు శాంతబాయి, బాబారావు అదనపు కట్నం కోసం అర్చనను రోజూ వేధించే వారు. దీనిపై ఆమె తన తల్లిదండ్రులకు చెప్పుకొని మధనపడేది. వ్యవసాయ కూలీ పనులు చేసుకొనే తల్లిదండ్రులది అదనపు కట్నం ఇవ్వలేని స్థితి.

ఈ నేపథ్యం లో భర్తతో పాటు అత్తామామలు పెట్టే చిత్రహింసలు భరించలేని అర్చన శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె పుట్టింటి వారికి సమాచారమిచ్చారు. అయితే, సోమవా రం మద్నూర్‌ మండలంలోని పెద్ద ఎక్లారలో చెరువులో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారమందింది. మృతదేహాన్ని వెలికి తీసి, ఆమె అర్చన అని నిర్ధారించారు. చిత్రహింసలు భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

ఠాణా వద్ద ఉద్రిక్తత..
చెరువులో అర్చన మృతదేహం ఉందని తెలియగానే పుట్టింటి వారు, బంధువులు, బింగోళి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్నూర్‌కు తరలివచ్చారు. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని చంపేశారని ఆమె తల్లిదండ్రులు కీరాబాయి, వామన్‌రావు, బంధువులు మద్నూర్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పెళ్లి సమయంలో రూ.5 లక్షలు, నాలుగు తులాల బంగారం పెట్టామని, ఇంకా కట్నం తేవాలని సంతోష్‌ తరచూ వేదించే వాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే మృతదేహాన్ని చెరువులో పడేశారని వారు ఆరోపించారు.

తమకు న్యాయం చేయాలని, అదనపు కట్నం కోసం తమ కూతురి ప్రాణాలు తీసిన సంతోష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న వారితో డీఎస్పీ నరసింహరావు మాట్లాడి సర్దిచెప్పారు. హత్య, ఆత్మహత్య అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని సముదాయించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద సీఐ సర్దార్‌సింగ్, ఎస్సై కాశీనాథ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement