మరో పోరాటం | Laugh of the movement effect svatantyradina | Sakshi
Sakshi News home page

మరో పోరాటం

Aug 15 2013 2:22 AM | Updated on Sep 1 2017 9:50 PM

సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం స్వాతంత్య్రదిన వేడుకలపై గట్టిగా పడనుంది. ఈ వేడుకల్లో ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తగ్గే అవకాశముంది...

సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం స్వాతంత్య్రదిన వేడుకలపై గట్టిగా పడనుంది. ఈ వేడుకల్లో ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తగ్గే అవకాశముంది, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమబాట పట్టడంతో సందడి లేకపోవచ్చు. అవనిగడ్డ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వ ప్రచారం లేకుండా వేడుకలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. అందుకే ఆడంబరాలు లేకుండా అత్యంత సాదాసీదాగా వేడుకలను నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.

ఈసారి ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శనకు కూడా అనుమతి లేదు. గత ఏడాది సుమారు రూ. 10 లక్షలు ఖర్చుపెట్టి ప్రభుత్వ పథకాల గొప్పతనం వివరిస్తూ శకటాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుత  ఉపఎన్నిక కారణంగా పథకాల బాకాలు లేకుండానే వేడుకలు నిర్వహించాల్సి ఉంది. దీనికితోడు పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారికిచ్చే ప్రశంసాపత్రాల సంఖ్యను కూడా కుదించారు. సుమారు 67 ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలకు చెందిన వారు అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఆగస్టు 15న ప్రశంసాపత్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

గత ఏడాది దాదాపు 300 మందికి ఉత్తమ సేవా ప్రశంసాపత్రాలను ఇవ్వగా, ఈసారి వాటిని 150కి కుదించారు. ప్రశంసాపత్రానికి విలువ పెంచేందుకే తక్కువమందికి ఇస్తున్నట్టు అధికారులు ధ్రువీకరించారు.వేడుకల్లో కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి ప్రసంగంలో సైతం ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ పథకాల ప్రస్తావన ఉండదు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత, సమరయోధుల త్యాగం వంటి విషయాలకు మాత్రమే కలెక్టర్ ఉపన్యాసం పరిమితం కానుంది.

జాతీయ పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు, బాలల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది   నుంచి 11 గంటల వరకు వేడుకలు నిర్వహిస్తారని జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయచందర్ ‘సాక్షి’కి చెప్పారు. బుధవారం  డీఆర్వో, ఎస్పీ జె.ప్రభాకర్, డీఆర్‌డీఏ పీడీ కె.శివశంకర్, బందరు ఆర్డీవో పి.సాయిబాబు, ఏఎస్పీ షిమోశి బాజ్‌పాయ్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.  

 ప్రశంసాపత్రాలకు దూరం..
 సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు జాతీయ పతాకానికి వందనం చేయాలని నిర్ణయించారు.  ఆయా పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండా ఎగురవేయాలని సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాల జేఏసీ తీర్మానించింది. ఉద్యోగులెవరూ ప్రశంసాపత్రాలను తీసుకోకూడదని పిలుపునిచ్చింది. పతాకావిష్కరణ అనంతరం మరో స్వాతంత్య్ర పోరాటం మాదిరిగా సమైక్య ఉద్యమంలోకి వెళ్లాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement