రాష్ట్ర బీజేపీనే రద్దు చేయించింది...

రాష్ట్ర బీజేపీనే రద్దు చేయించింది... - Sakshi


ప్రధాని అపాయింట్‌మెంట్‌ రద్దుపై జితేందర్‌రెడ్డి

ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నారు



సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అఖిలపక్షంతో ప్రధానిని కలిసేందుకు యత్నించగా.. తెలంగాణ బీజేపీ అపాయింట్‌మెంటును రద్దు చేయించిందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వా నికి తాము మద్దతుగా నిలుస్తున్నా ఏ మాత్రం సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.



‘‘మాది కొత్త రాష్ట్రం. కేంద్రం నుంచి పూర్తి మద్దతు కావాలని మొదట్నుంచీ అడుగుతు న్నాం. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మేం సాయపడుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాకు ఈ దిశగా తగిన సూచనలు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలను కూడా కేంద్రం అమలు చేయలేదు. హక్కుభుక్తంగా ఉన్నవాటినే మేం అడుగుతున్నాం. బయటి నుంచి ఒక్కటి అడగలేదు. చాలా బాధతో ఈ మాట చెబుతున్నాం.



ప్రత్యేక హైకోర్టు ఇప్పటివరకు కాలేదు. ఎయిమ్స్‌ అడిగాం.. ఇవ్వలేదు. ఐఐఎం అడిగాం.. ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణ కోసం మా రాష్ట్రంలో ఉన్న డిమాండ్‌ను ప్రధాని దృష్టికి తెచ్చేందుకు అఖిలపక్ష సమావేశంతో వచ్చి కలవాలని మా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ అడిగారు. అయితే అపాయింట్‌మెంటు ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్నారు. తెలంగాణ బీజేపీ ప్రధానికి చెప్పి ఈ అపాయింట్‌మెంట్‌ను రద్దు చేయించింది. విపక్షాలు మాపై ఎన్ని విమర్శలు చేసినా.. మేం కేంద్రానికి అనేక అంశాల్లో మద్దతుగా నిలిచాం. కానీ ఏదీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున మా శకటాన్ని కూడా ప్రదర్శించనివ్వడం లేదు. నోట్లరద్దును విపక్షాలు వ్యతిరేకించినా.. మేం మీకు మద్దతుగా నిలిచాం..’’ అని ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి చెప్పారు.



వాయిదా పడి ఉండొచ్చు.. రద్దు కాలేదు: దత్తాత్రేయ

ఎంపీ జితేందర్‌ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ సమాధానం ఇచ్చారు. ‘‘జితేందర్‌రెడ్డి చెబుతు న్నదాంట్లో వాస్తవం లేదు. అపా యింట్‌మెంటును వ్యతిరేకించామ నడం సత్యదూరం. ఉమ్మడి రాష్ట్రంలోనే మేం ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికాం. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నాం. అపాయింట్‌మెంట్‌ వాయిదా పడి ఉండొ చ్చు. కానీ రద్దు కాలేదు. మేం వర్గీకరణకు మద్దతుగా ఉంటాం.. తెలంగాణకు కేంద్రం మద్దతుగా నిలుస్తోంది’’ అని చెప్పారు. దీనిపై జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇవి నా మాటలు కాదు. మీ పార్టీ నేతలు చెబితే పత్రికల్లో వచ్చిన సమాచారం అది.


టీఆర్‌ఎస్‌కు మైలేజీ వస్తుందని భావించి అపాయింట్‌మెంట్‌ రద్దు చేయించామని బీజేపీ నేతలు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. దానికి మేం చింతిస్తున్నాం. మాకు కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి. పార్లమెంటరీ మంత్రి ఎప్పుడు అడిగినా కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నాం’’ అని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 119 సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, డబుల్‌ బెడ్‌రూమ్, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు కేంద్రం తగిన సాయం చేయాలని కోరారు. పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top