ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి | inter student commits suicide due to ragging in anantapur | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి

Jul 31 2015 1:12 PM | Updated on Nov 9 2018 4:36 PM

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి - Sakshi

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధి బలయ్యాడు. అనంతపురం జిల్లా ఓడీసీ మండలం దొమ్మితోటవారిపల్లెకు చెందిన మధువర్థన్ రెడ్డి ..

అనంతపురం : ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధి బలయ్యాడు. రిషితేశ్వరి ఉదంతాన్ని మరవకముందే అలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా ఓబులదేవపురం చెరువు మండలం గండికోట వారిపల్లి గ్రామానికి చెందిన మధువర్థన్ రెడ్డి(16) శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో నెల్లూరు శ్రీగాయత్రి విద్యసంస్థల ప్రతినిధులు అతి తక్కువ ఫీజుతో అతన్నిఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేర్చుకున్నారు.

హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న మధును కొందరు సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ఈ నెల 11న హాస్టల్లో ఉన్న మధును కొందరు సీనియర్ విద్యార్థులు దుప్పటి కప్పి చితకబాదారు. దీంతో అతని ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వెళ్లి కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకుంటామని చెప్పారే తప్ప చర్యలు తీసుకోలేదు.

కాగా మధు ఈ నెల 12న హోం సిక్ సెలవులకు  ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి కళాశాలకు వెళ్లనని తండ్రికి చెప్పాడు. దీంతో తండ్రి ఏం జరిగిందని ఆరా తీయడంతో విషయం బయటకు వచ్చింది. కళాశాలకు వెళ్లి మధు తండ్రి యాజమాన్యంతో మాట్లాడిన వారి తీరులో ఏలాంటి మార్పు రాలేదు. తనపై దాడి చేసిన విద్యార్థులను హాస్టల్ నుంచి తొలగిస్తేనే అక్కడ చదువుకుంటానని మధు మొండి పట్టుపట్టాడు. దీంతో తండ్రి అతన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. కాగా.. గురువారం సాయంత్రం కళాశాల సిబ్బంది మధు తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. మధును కళాశాలకు పంపించాలని లేకపోతే ముఖ్యమైన పాఠాలను కోల్పోతాడని చెప్పారు.

దీంతో మధు తండ్రి నేను ఎంత చెప్పిన వినడం లేదని చెప్పారు. ఆ తర్వాత మధుతో కాలేజీ సిబ్బంది మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన అనంతరం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు రాత్రి ఇంటికి తిరిగి రాలేదు.. చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. ఉదయం బావి దగ్గర అతని బైక్ కనిపించిందని సమాచారం అందుకున్న తండ్రి తోటలోకి వెళ్లి చూసేసరికి మామిడి చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు.

కాలేజ్ యాజమాన్యం తన కొడుకుతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాతే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. ర్యాగింగ్ చేస్తున్నారని ముందు చెప్పిన కాలేజీ అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement