breaking news
madhuvardhan reddy
-
మధువర్ధన్‌రెడ్డిది సర్కారు హత్యే
కదిరి: ‘మొన్న రిషితేశ్వరి ర్యాగింగ్‌తో కన్నుమూసింది. నిన్న మధువర్ధన్రెడ్డిని కూడా అదే ర్యాగింగ్ భూతం మింగేసింది. ప్రభుత్వం మొద ట్లోనే తగిన చర్యలు తీసుకున్నట్లైతే ర్యాగింగ్ భూతానికి మధు బలయ్యేవారు కాదు. మధువర్ధన్‌రెడ్డిది ముమ్మాటికీ ఆత్మహత్య కాదు..సర్కారు హత్య’ అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మధువర్ధన్‌రెడ్డి తండ్రి బ్రహ్మానందరెడ్డి, సోదరుడు ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి శనివారం అన్ని విద్యార్థి సంఘాలు అనంతపురం జిల్లా కదిరిలో మానవహారంతో పాటు రాస్తారోకో నిర్వహించారు. ర్యాగింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక పోవడంతోనే వరుసగా మెరిట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు రాఘవేంద్ర, రాజేంద్ర తదితరులు పేర్కొన్నారు. ‘‘అక్కడ జరిగిన విషయం నా కొడుకు ఇంటికొచ్చి చెప్పగానే నేను ఆ కళాశాల వారితో మాట్లాడాను. వారు నా మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ జూలై 25వ తేదీన కూడా నా కొడుకు మధు, నేను మరోసారి ఆ కాలేజ్‌కి వెళ్లి అడిగాం. నన్ను ర్యాగింగ్ చేసి, బాగా కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా వాడు వాళ్లను గట్టిగా అడిగాడు. వాళ్లు ‘ఆఆఆఆ..ఇవన్నీ మామూలే. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకూడదు..ర్యాగింగ్ అనేది కామన్’’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నా కొడుక్కు కోపమొచ్చింది..లగేజ్ తీసుకొని వచ్చేశాం. మళ్లీ 30వ తేదీ వాళ్లే ఫోన్ చేసి ‘‘మీ వాడు మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్. వాడు కచ్చితంగా ఇంటర్లో నెల్లూరు టాపర్‌గా ఉంటాడు. మీవాడితో పాటు మా కాలేజ్‌కి కూడా మంచి పేరొస్తుందని చెప్పడంతో వాడితోనే మాట్లాడండని ఫోన్ మధుకు ఇచ్చాను. వాళ్లు ఏం మాట్లాడారో..ఏమో గానీ నా బిడ్డను మాత్రం పోగొట్టుకున్నానయ్యా..వాడు చాలా మంచోడూ..చాలా తెలివైనవాడు..’’ అంటూ ఆ విద్యార్థి తండ్రి బ్రహ్మానందరెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ విద్యార్థి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ కళాశాల గుర్తింపును రద్దు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని జాతీయ రహదారిపైనే 3 గంటల పాటు బైఠాయించారు. తొలుత తహసీల్దార్ నాగరాజు అక్కడికి చేరుకొని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. వారు వినకపోయేసరికి పోలీసులు ఆర్డీఓ రాజశేఖర్‌ను అక్కడికి పిలిపించి నచ్చజెప్పేలా చూశారు. ఈ సంఘటనపై విచారణ వేగవంతం చేశామని, ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఇప్పటికే కదిరి డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు నెల్లూరుకు వెళ్లి ఆ కళాశాల విద్యార్థులు, యాజమాన్యంతో వేర్వేరుగా మాట్లాడి విచారిస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడంతో శాంతించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగంతోపాటు ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
అనంతపురం : ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధి బలయ్యాడు. రిషితేశ్వరి ఉదంతాన్ని మరవకముందే అలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా ఓబులదేవపురం చెరువు మండలం గండికోట వారిపల్లి గ్రామానికి చెందిన మధువర్థన్ రెడ్డి(16) శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో నెల్లూరు శ్రీగాయత్రి విద్యసంస్థల ప్రతినిధులు అతి తక్కువ ఫీజుతో అతన్నిఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్చుకున్నారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న మధును కొందరు సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ఈ నెల 11న హాస్టల్లో ఉన్న మధును కొందరు సీనియర్ విద్యార్థులు దుప్పటి కప్పి చితకబాదారు. దీంతో అతని ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వెళ్లి కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకుంటామని చెప్పారే తప్ప చర్యలు తీసుకోలేదు. కాగా మధు ఈ నెల 12న హోం సిక్ సెలవులకు ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి కళాశాలకు వెళ్లనని తండ్రికి చెప్పాడు. దీంతో తండ్రి ఏం జరిగిందని ఆరా తీయడంతో విషయం బయటకు వచ్చింది. కళాశాలకు వెళ్లి మధు తండ్రి యాజమాన్యంతో మాట్లాడిన వారి తీరులో ఏలాంటి మార్పు రాలేదు. తనపై దాడి చేసిన విద్యార్థులను హాస్టల్ నుంచి తొలగిస్తేనే అక్కడ చదువుకుంటానని మధు మొండి పట్టుపట్టాడు. దీంతో తండ్రి అతన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. కాగా.. గురువారం సాయంత్రం కళాశాల సిబ్బంది మధు తండ్రితో ఫోన్లో మాట్లాడారు. మధును కళాశాలకు పంపించాలని లేకపోతే ముఖ్యమైన పాఠాలను కోల్పోతాడని చెప్పారు. దీంతో మధు తండ్రి నేను ఎంత చెప్పిన వినడం లేదని చెప్పారు. ఆ తర్వాత మధుతో కాలేజీ సిబ్బంది మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన అనంతరం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు రాత్రి ఇంటికి తిరిగి రాలేదు.. చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. ఉదయం బావి దగ్గర అతని బైక్ కనిపించిందని సమాచారం అందుకున్న తండ్రి తోటలోకి వెళ్లి చూసేసరికి మామిడి చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. కాలేజ్ యాజమాన్యం తన కొడుకుతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. ర్యాగింగ్ చేస్తున్నారని ముందు చెప్పిన కాలేజీ అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.