రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలగా అంగడికిష్టాపూర్ | Ideal school angadikistapur anniversary | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలగా అంగడికిష్టాపూర్

Mar 24 2016 2:25 AM | Updated on Sep 3 2017 8:24 PM

రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలగా అంగడికిష్టాపూర్

రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలగా అంగడికిష్టాపూర్

‘సర్కార్ స్కూలా..! అక్కడికి పంపితే పిల్లలకు చదువు సరిగ్గా రాదు.. ఏబీసీడీలు సంగతి దేవుడెరుగు, కనీసం అఆఇఈలు కూడా నేర్చుకోలేరు.

5వ తరగతి లోపు పిల్లలంతా సర్కార్ స్కూల్‌కే!
నేడు వార్షికోత్సవం.. ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎంపీ రాక

 జగదేవ్‌పూర్: ‘సర్కార్ స్కూలా..! అక్కడికి పంపితే పిల్లలకు చదువు సరిగ్గా రాదు.. ఏబీసీడీలు సంగతి దేవుడెరుగు, కనీసం అఆఇఈలు కూడా నేర్చుకోలేరు. ఇంగ్లిష్ సార్లు అసలే ఉండరు’. ప్రభుత్వ పాఠశాలపై ఈ తరహా అభిప్రాయం అనేక మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఇలాంటి దురభిప్రాయాల్ని అంగడికిష్టాపూర్ ప్రాథమిక పాఠశాల పటాపంచలు చేసింది. ఉపాధ్యాయుల కృషి.. విద్యాశాఖ సహకారం.. గ్రామస్తుల తీర్మానం.. ఆ స్కూల్ దశ, దిశని మార్చేసింది. గతంలో ఈ స్కూల్‌పై ‘మన ఊరు.. మన బడి’ అనే కథనం ‘సాక్షి’లో కూడా ప్రచురితమైంది.

ఈ క్రమంలో మొదటి వార్షికోత్సవానికి సిద్ధమైన బడిని మరోసారి గుర్తుచేసుకుందాం... జగదేవ్‌పూర్ మండలంలోని 23 గ్రామ పంచాయతీలు, 9 మదిర గ్రామాల్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 50 ఉన్నాయి. వీటిలో 55 ఏళ్ల క్రితం అంగడికిష్టాపూర్ గ్రామంలో ప్రారంభమైన ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. వందల మంది విద్యార్థులతో వెలిగిన పాఠశాల క్రమంగా 12 మందికి తగ్గి మూసివేత దిశగా చేరింది. అదే సమయంలో హెచ్‌ఎంగా ఉన్న ఓంకార్.. స్కూల్ పునఃవైభవానికి నడుం బిగించారు. సర్పంచ్ రాములు, గ్రామస్తులకు అవగాహన కల్పిండంతో గత ఏడాది మార్చిలో ఎంఈఓ సుగుణాకర్‌రావుతో సమావేశమయ్యారు. గ్రామంలో ఉన్న 5వ తరగతి లోపు పిల్లలకు ప్రభుత్వ బడికే పంపిస్తామని తీర్మానం చేశారు. ఫలితంగా గత ఏడాది 12 ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 72 మందికి చేరారు. ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తుల సహకారంతో మరో ముగ్గురు ఇక్కడ పనిచేస్తున్నారు.

 ప్రైవేటుకు ధీటుగా..
పాఠశాల చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయడంతో పాటు చెట్లు ఏపుగా పెరిగాయి. బడి బాగు కోసం గ్రామస్తులు నిధి ఏర్పాటుచేశారు. దీని నుంచే ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తున్నారు. 12 మంది దాతల సహకారంతో ప్రొజెక్టర్, కంప్యూటర్, కుర్చీలు, యూనిఫాం, ట్రై, బెల్టులు సమకూర్చారు. ఈక్రమంలో ఆదర్శ పాఠశాలగా అంగడికిష్టాపూర్ పేరు సాధించడం విశేషం.

 నేడు వార్షికోత్సవం
అంగడికిష్టాపూర్ ప్రాథమిక పాఠశాల మన ఊరు మన బడికి ఏడాది పూర్తి కావడంతో నేడు(బుధవారం) సాయంత్రం వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆహ్వాన కార్డులు ముద్రించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నారు.

 ఒంటిమిట్టపల్లే ఆదర్శం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఒంటిమిట్టపల్లి పాఠశాలే మాకు ఆదర్శం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ ప్రీ ప్రైమరీ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఆ పాఠశాల మదిరిగానే మేం కూడా సాధిస్తాం. మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు మా పాఠశాల విద్యార్థులు 11 మంది రాయగా 8 మందికి సీట్లు వచ్చాయి. - ఓంకార్, హెచ్‌ఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement