రక్తమోడిన రహదారులు | four dies of road accidents | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారులు

May 3 2017 11:08 PM | Updated on Aug 30 2018 4:10 PM

రక్తమోడిన రహదారులు - Sakshi

రక్తమోడిన రహదారులు

అనంతపురం-చిత్తూరు జిల్లాల సరిహద్దులోని తనకల్లు మండలం చీకటిమానిపల్లె వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

తనకల్లు (కదిరి) : అనంతపురం-చిత్తూరు జిల్లాల సరిహద్దులోని తనకల్లు మండలం చీకటిమానిపల్లె వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా మదనపల్లె నీరుగట్టుపల్లికి చెందిన సుబ్రమణ్యం, కృష్ణమూర్తి సోదరులు. వీరు పట్టుచీరల వ్యాపారం చేస్తారు. అనంతపురంలోని తమ సమీప బంధువు ఇట్లో జరిగే శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలసి కారులో బయలుదేరారు.

మార్గమధ్యంలోని చీకటిమానిపల్లె సమీపంలోని పేపర్‌మిల్లు మలుపులోకి రాగానే కారు ముందు చక్రం పంక్చర్‌ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనున్న పెద్ద చెట్టుకు బలంగా ఢీకొంది. ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. అందులో ముందు సీటులో కూర్చొని ప్రయాణిస్తున్న కృష్ణమూర్తి(40), వెనక సీటులో కూర్చున్న ఆయన భార్య శకుంతల(38) అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమార్తె జస్విక, డ్రైవర్‌ సుబ్రమణ్యం, ఆయన భార్య సరస్వతి, వారి కుమారుడు విష్ణువర్దన్‌ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే 108లో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రంగానాయక్‌ తెలిపారు.

ధర్మవరంలో స్కూటరిస్టు...
ధర్మవరం అర్బన్ : ధర్మవరంలోని కాలేజీ సర్కిల్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన పద్మావతి, గాండ్ల శివయ్య దంపతుల కుమారుడు గాండ్ల నాగరాజు(28) దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు... బైక్‌లో వస్తున్న నాగరాజు కాలేజీ సర్కిల్‌లోకి రాగానే లారీని ఓవర్‌టెక్‌ చేసేందుకు ప్రయత్నించారు. అంతలోనే ఎదురొచ్చిన మరో వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ అదుపు తప్పి లారీ కింద పడిపోయింది. ఘటనలో నాగరాజు లారీ వెనుక చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలొదిలాడు. అయితే ఆ దృశ్యం భయంకరంగా ఉంది.  సమాచారం తెలిసిన వెంటనే ఎస్‌ఐ జయానాయక్‌ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి..
బీటెక్‌ చదివిన నాగరాజు బెంగళూరులో కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే సుజిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ప్రస్తుతం ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే జీతం చాలకపోవడంతో తిరిగి మేడాపురం చేరుకున్నారు. ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకునేవారు. ఆయన భార్య ధర్మవరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా వెళ్లేవారు.  

ఆటో బోల్తాపడి మరొకరు..
ముదిగుబ్బ : ముదిగుబ్బ - కదిరి మార్గంలోని పెట్రోల్‌ బంకు వద్ద బుధవారం ఆటో బోల్తా పడిన ఘటనలో గుంజేపల్లికి చెందిన గంగన్న(68) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కదిరి వైపు నుంచి ముదిగుబ్బ వైపునకు ఊరగాయల సీసాల లోడుతో వస్తున్న ఆటో మార్గమధ్యంలోని ఎన్‌.ఎస్‌.పి. కొట్టాల వద్ద గంగన్న అనే ప్రయాణికుడ్ని ఎక్కించుకొని వేగంగా వస్తోంది. ముదిగుబ్బ వద్ద ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే.. పెట్రోలు కోసం ఆటోను తిప్పక అడ్డొచ్చిన బైక్‌ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్‌ సడన్‌ బ్రెక్‌ వేశాడు. దీంతో ఆటో ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. డ్రైవర్‌ పక్కనే కూర్చున్న గంగన్న ఆటో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతునికి భార్య నారాయణమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement