ఉపాధి వేటలో మృత్యు హేల | four dies in several road accidents | Sakshi
Sakshi News home page

ఉపాధి వేటలో మృత్యు హేల

Sep 3 2016 11:55 PM | Updated on Aug 30 2018 4:07 PM

వారంతా శ్రమజీవులు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు శక్తినంతా ధారపోస్తే గానీ కడుపుకింత గంజి దొరకదు.

•   వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు
•   నలుగురి దుర్మరణం
•   శోకసంద్రంలో బాధిత కుటుంబాలు

వారంతా శ్రమజీవులు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు శక్తినంతా ధారపోస్తే గానీ కడుపుకింత గంజి దొరకదు. ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క, ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లి రావడం పరిపాటి. ఈ నేపథ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే రోజు నలుగురు అకాల మృత్యువాతపడ్డారు. అయిన వారు దిక్కులేని వారయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.


గోరంట్ల–హిందూపురం ప్రధాన రహదారిలోని సోమందేపల్లి మండలం తుంగోడు వద్ద Ô¶ నివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో లేపాక్షి మండలం మానెంపల్లికి చెందిన అజయ్‌(23) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చెన్నై నుంచి హిందూపురానికి కొరియర్‌ సామగ్రిని తరలిస్తుండగా మార్గమధ్యంలోని తుంగోడు వద్ద గల మలుపులోకి రాగానే మినీ ఆటో బోల్తాపడి అతను అక్కడికక్కడే చనిపోయినట్లు చెప్పారు. క్లీనర్‌ షాషాకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి రెండు నెలల కిందటే పెళ్లి అయినట్లు బంధువులు తెలిపారు. అంతలోనే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఘటన ప్రాంతం హోరెత్తిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

కళ్యాణదుర్గం మండలంలో ఇద్దరు..
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్టకు చెందిన పలువురు కూలీలు డీజిల్‌ ఆటోలో ఉపాధి పనులకోసం శీబావి గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో బోరంపల్లి వద్ద డీజల్‌ ఆటోను కాసేపు ఆపారు. ఈ సమయంలో అనంతపురం వైపు నుంచి వెళుతున్న ఐచర్‌ వాహనాన్ని మరో ఐచర్‌ ఓవర్‌ టేక్‌ చేయడానికి దూసుకొచ్చి ఈ ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న కూలీ ప్రకాష్‌(20) తల ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయాడు. కూడేరు మండలం ఇప్పేరు గ్రామానికి చెందిన వెంకటరాముడు, నాగలక్ష్మి, ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి బైక్‌లో పనుల కోసం కళ్యాణదుర్గానికి వస్తున్నారు. ఒంటిమిద్ది గ్రామం వద్ద వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో నాగలక్ష్మి(25) కిందపడిపోగా తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆమెను ఆర్డీటీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు శంకర్‌రెడ్డి, నబీరసూల్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కక్కలపల్లి క్రాస్‌లో స్కూటరిస్టు..
అనంతపురం సెంట్రల్‌ : జాతీయ రహదారిలోని అనంతపురం–రాప్తాడు మార్గంలో గల కక్కలపల్లి క్రాస్‌ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగానపల్లి మండలం గుంతపల్లి చెందిన నీలం హనుమంతరెడ్డి(45) అనే స్కూటరిస్టు మరణించినట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు. అనంతపురంలో పని ముగించుకుని స్వగ్రామానికి బైక్‌లో బయలుదేరిన హనుమంతరెడ్డి రుద్రంపేట దాటగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారన్నారు. వెంటనే అతన్ని అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. ప్రమాదానికి కారణమైన లారీని పట్టుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement