రక్తాన్ని రుచి మరిగిన మాయదారులు మారణహోమాన్నే సృష్టిస్తున్నాయి.
- వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
- నిన్నటి ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరు యువకులూ మృతి
రక్తాన్ని రుచి మరిగిన మాయదారులు మారణహోమాన్నే సృష్టిస్తున్నాయి. ప్రతి రోజూ కనీసం నలుగురైదుగురు ప్రాణాలు కోల్పోతుండగా, పదుల సంఖ్యలో గాయపడుతున్నారు. తాజాగా ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకే రోజు నలుగురు మరణించగా, వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరు యల్లనూరు మండలానికి చెందిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం వల్ల కొన్ని, మానవ తప్పిదాలతో మరికొన్ని సంఘటనలు జరిగాయి.
బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయుసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి సమీపంలోని నరసమ్మ ఆలయం వద్ద రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్న సంఘటనలో గార్లదిన్నె మండలం పెనకచర్లకు చెందిన తిరుపాలు(38), నార్పలకు చెందిన బయ్యన్న(35) మరణించారని పోలీసులు తెలిపారు. గార్లదిన్నె మండలం పెనకచర్లకు చెందిన తిరుపాలు తన భార్య శకుంతలతో కలసి అత్తగారి ఊరైన చెన్నంపల్లికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బైక్‌లో దంపతులిద్దరూ స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో దయ్యాలకుంటపల్లి సమీపానికి రాగానే నార్పలకు చెందిన బయన్న(ఐచర్ డ్రైవర్), రామదాసు, పవన్ మరో బైక్‌లో ఎదురొచ్చారు. అప్పటికే వీరు ముగ్గురు(అనంతపురంలో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో మందు తాగి ఉన్నారు) విపరీతమైన వేగంతో వచ్చి తిరుపాలు బైక్‌ను ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించగా, శకుంతల సహా నార్పలకు చెందిన ముగ్గురూ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బయన్న తుదిశ్వాస వదిలాడు. తిరుపాలుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా, బయన్నకు ఒక కుమార్తె ఉంది. భార్య ప్రస్తుతం గర్భిణి.
బైక్ చెట్టును ఢీకొని మరో యువకుడు..
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి వద ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మవరానికి చెందిన మహేశ్(24) మరణించగా, రియాజ్, మల్లికార్జున గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు మంచి మిత్రులు. ధర్మవరానికి చెందిన మరో స్నేహితుడి వివాహం కొత్తచెరువు మండలం కొడపగానపల్లిలో జరుగుతుండగా అక్కడ హాజరయ్యేందుకు శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత బైక్‌లో బయలుదేరారు. మార్గమధ్యంలోని బసంపల్లి వద్దకు రాగానే వారి బైక్ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును బలంగా ఢీకొనడంతో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. వారిని ధర్మవరం, ఆ తరువాత అనంతపురం పెద్దాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మితిమీరిన వేగమే ప్రాణాల మీదికి వచ్చిందన్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.