ముగిసిన ఎంసెట్ కౌన్సెలింగ్ | EAMCET Counseling ended | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎంసెట్ కౌన్సెలింగ్

Jun 15 2016 11:38 PM | Updated on Sep 4 2017 2:33 AM

ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ -2016 వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన

 ఎచ్చెర్ల: ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ -2016 వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన బుధవారంతో ముగిసింది. శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ఈ నెల ఆరో తేదీన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. చివరి ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి కాగా, ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఈనెల 18వ తేదీ వరకు సమయం ఉంది. అలాగే 19, 20 తేదీల్లో ఆప్షన్లు మార్చుకోవచ్చు.
 
 గతంతో పోల్చితే..
 గత ఏడాదితో పోల్చుకుంటే జిల్లా నుంచి కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థుల సంఖ్య 192 తగ్గింది. గత ఏడాది మొదటి కౌన్సెలింగ్‌లో  3,017 మంది హాజరవ్వగా.. ఈసారి 2,825 మంది హాజరయ్యారు. ఎంసెట్ రాసిన, ఉత్తీర్ణత సాధించిన వారి సంఖ్య పెరిగినప్పటికీ.. కౌన్సెలింగ్‌కు హాజరైన వారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఎంసెట్ రాసి ర్యాంకు సాధించిన వారిలో కొంతమంది డిగ్రీలో చేరేందుకు ఇష్టపడుతున్నట్టు తెలిసింది. అలాగే అనుకున్న బ్రాంచ్, కళాశాలల్లో సీటు రాకపోరుున వారు కూడా డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది.
 
 దరఖాస్తుల చేసిన వారి వివరాలు
 ఈ ఏడాది జిల్లా నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 5,918 మంది దరఖాస్తు చేసుకోగా, 5328 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 3,954 మంది అర్హత సాధించారు. గతంతో పోల్చుకుంటే పరీక్ష రాసేవారి సంఖ్య పెరిగింది. అయితే కౌన్సెలింగ్‌కు హాజరు మాత్రం తగ్గింది. 2013లో 4,196, 2014లో 4,850, 2015లో 4,711 మంది పరీక్ష రాశారు. కౌన్సె లింగ్‌కు హాజరైన వారి వివరాలు చూస్తే.. 2012లో 2,340, 2013లో 3,950 (పక్కా జిల్లాల విద్యార్థులు ఎక్కువగా హాజరయ్యారు), 2014లో 2,206, 2015 లో 3017, 2016లో  2,825 మంది హాజరయ్యూరు.
 
 జిల్లాలో పరిస్థితి ఇలా..
 జిల్లాలో ప్రస్తుతం ఏడు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2,562 సీట్లు ఉన్నాయి. గత కొన్నేళ్ల నుంచి ప్రవేశాలు పరిశీలిస్తే 2012లో 3,628 సీట్లకు 1605, 2013లో 3,132 సీట్లకు 1599, 2014లో 3,014 సీట్లకు 1585 , 2015లో 2,688 సీట్లకు 1901 నిండాయి. అయితే జిల్లాలో కళాశాలలు 10 నుంచి ఏడుకు, సీట్లు 3,628 కన్వీనర్ సీట్ల నుంచి 2,562కు తగ్గాయి. ప్రస్తుతం జిల్లా విద్యార్థులు పక్క జిల్లాల కళాశాలకు ప్రాధాన్యత ఇస్తే ఇక్కడ అడ్మిషన్లు కష్టం. ఏటా శత శాతం ప్రవేశాలు రెండు కళాశాలల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రవేశాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement