
కౌంట్ డౌన్ !
దూదేకుల చమన్ సాహెబ్.. ఒకప్పుడు జిల్లా బహిష్కరణకు గురైన వ్యక్తి. ఇప్పుడు జిల్లా ప్రథమ పౌరుడు. జిల్లా పరిషత్‌లో అత్యధిక స్థానాలు టీడీపీకి దక్కడంతో ఆ పార్టీ నిర్ణయం మేరకు మొదటి రెండున్నరేళ్లు చమన్‌కు చైర్మన్‌గిరి దక్కింది.
– జిల్లా పరిషత్ చైర్మన్ మార్పుపై టీడీపీ సమన్వయ కమిటీలో చర్చ
– ఒప్పందం మేరకు రెండున్నరేళ్ల తర్వాత పూల నాగరాజుకు కట్టబెట్టేందుకు పార్టీ నిర్ణయం!
– మరో ఆర్నెల్లు పొడిగించాలని చమన్ విన్నపం..పూల నాగరాజుతోనూ సంప్రదింపులు
– చమన్ విన్నపాన్ని పూర్తిగా పక్కనపెట్టిన పార్టీ నేతలు
– ఒప్పందానికి కట్టుబడి జనవరి 5న తొలగిపోవాలంటున్న పలువురు ఎమ్మెల్యేలు
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
దూదేకుల చమన్ సాహెబ్.. ఒకప్పుడు జిల్లా బహిష్కరణకు గురైన వ్యక్తి. ఇప్పుడు జిల్లా ప్రథమ పౌరుడు. జిల్లా పరిషత్‌లో అత్యధిక స్థానాలు టీడీపీకి దక్కడంతో ఆ పార్టీ నిర్ణయం మేరకు మొదటి రెండున్నరేళ్లు చమన్‌కు చైర్మన్‌గిరి దక్కింది. ఆయనకు ఇచ్చిన కాలపరిమితి త్వరలో ముగియనుంది. ఈ క్రమంలో తనకు గతంలో ఇచ్చిన మాట మేరకు చైర్మన్‌గిరి కట్టబెట్టాలని గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో టీడీపీ అధిష్టానం ఈ అంశాన్ని పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ కొల్లు రవీంద్రకు అప్పగించింది.
ఈ క్రమంలో ఆయన జిల్లా సమన్వయ కమిటీతో శనివారం పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ చమన్ కూడా హాజరయ్యారు. టీడీపీ వర్గాల సమాచారం మేరకు సమావేశంలో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి. మొదట మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ ఒప్పందం మేరకు జెడ్పీ చైర్మన్ గడువు జనవరి 5తో ముగుస్తుందని, ఆ అంశంపై చర్చిస్తే బాగుంటుందని లేవనెత్తారు. దీనిపై జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి స్పందిస్తూ ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని, కొద్దిరోజుల్లో నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ టీడీపీ ఆఫీసులోకి వెళ్లి దూదేకులకు రాజకీయ ప్రాధాన్యం తక్కువగా ఉందని, చమన్‌ను తొలగించకూడదని కొల్లుకు వినతిపత్రం అందజేశారు.
దీనిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి తీవ్రంగా స్పందించారు.పార్టీ విధానపరమైన నిర్ణయాలను అంతా గౌరవించాలని, ఇది టీడీపీ అంతర్గత అంశమని, కాంగ్రెస్ పార్టీ పేరుతోనో, కులాల పేరుతోనో రాద్ధాంతం చేయడం ఏంటని మండిపడ్డారు. ఇదే విషయంలో కొల్లు రవీంద్రతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చమన్ సూచనతోనే దాదాగాంధీ వచ్చినట్లు తెలుస్తోందని, అలా చేయాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.
చమన్‌కు మద్దతుగా ఎవ్వరూ లేరా?
చమన్‌కు మరో ఆర్నెల్ల పాటు చైర్మన్‌గా కొనసాగాలని ఉంది. దీనిపై గట్టిగా మాట్లాడి పదవి పొడిగింపుపై సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని మంత్రి సునీతతో చెప్పినట్లు తెలుస్తోంది. పైకి సరే అంటూ లోపల మాత్రం 'మనకెందుకులే' అనే ధోరణిని సునీత ప్రదర్శిస్తోన్నట్లు ఆ పార్టీ వర్గాలే చెప్పాయి. పార్టీలో ప్రస్తుతం సునీత వ్యతిరేక వర్గం బలంగా ఉంది. చమన్, మాజీ ఎమ్మెల్యే కందికుంట మినహా తక్కిన వారంతా ఆమెతో విభేదిస్తున్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి, ఎమ్మెల్సీ కేశవ్, జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి లాంటి నేతలు సునీత విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె మద్దతు చమన్‌కు ఉందంటే, వ్యతిరేకవర్గం తప్పనిసరిగా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇది చమన్‌కు ప్రతికూలంగా మారుతోంది. సునీత అనుచరుడిగా ముద్రపడటంతో ఆయన్ను తప్పించాలని వ్యతిరేకవర్గం ఇప్పటికే పార్టీ అధిస్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనవరి 5న చమన్ రాజీనామా చేయడం అనివార్యమయ్యేలా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సునీత కూడా తన మాట చెల్లుబాటుకాని పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని చమన్ కూడా పసిగట్టి సొంత ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ పంచాయితీని నేరుగా పూల నాగరాజుతోనే తెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగరాజు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
తక్కిన రెండున్నరేళ్ల పాటు తానే చైర్మన్‌గా ఉంటానని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చుతో పాటు అదనంగా ఇస్తానని చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. ఇది సాధ్యం కాకపోతే ఆర్నెల్లపాటు ఉండేందుకు సమ్మతించాలని కోరనున్నారు. కానీ ఈ రెండు ప్రతిపాదనలకు పూల నాగరాజు ఒప్పుకునే పరిస్థితి కన్పించడం లేదు. బుగ్గకారులో తిరగాలనే కోరిక ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తీరదని, కాబట్టి చైర్మన్‌గిరి కావల్సిందేనని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను బట్టి చమన్ జనవరి 5న రాజీనామా చేయకతప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై చమన్ కూడా స్పష్టతతోనే ఉన్నారు. సునీత అనుచరుణ్ని కాబట్టే చాలామంది తనకు మద్దతుగా సంప్రదింపులు జరిపేందుకు విముఖత చూపుతున్నారనే భావనతో ఉన్నారు.
మరోవైపు పరిటాల ముద్ర ఉంది కాబట్టే జెడ్పీచైర్మన్ గిరి తనకు దక్కిందనే భావన కూడా ఉంది. ఈ క్రమంలో పరిటాల కుటుంబం కోసం తాను కోల్పోయిన దానితో, పడిన ఇబ్బందులతో పోల్చితే జెడ్పీచైర్మన్ గిరీ చాలా తక్కువని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగింది, ఇక నుంచి పరిటాల ముద్ర నుంచి బయటపడి స్వతంత్రంగా నాయకుడిగా ఎదగడం మంచిదనే నిర్ణయానికి చమన్ వచ్చినట్లు సమాచారం. ఇదే జరిగితే రామగిరిలో పరిటాల కోటకు బీటలు వారినట్లే!