కౌన్సెలింగ్‌లో మతలబు! | Counseling in Counseling! | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్‌లో మతలబు!

Jul 1 2017 11:17 PM | Updated on Sep 5 2017 2:57 PM

వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని కొత్త పీహెచ్‌సీల్లో పోస్టుల భర్తీ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియను గుట్టుగా సాగించి తీరా రాత్రి పొద్దుపోయాక మీడియాకు వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

  • కొత్త పీహెచ్‌సీల్లో నియామకాలు
  • అభ్యర్థులకు సరైన సమాచారం కరువు
  • 14 పోస్టులకు ఆరుగురు మెడికల్‌ ఆఫీసర్లే హాజరు
  • అంతా ముగిశాక ‘మీడియా’కు సమాచారం
  • గైర్హాజరైన వారికి పోస్ట్‌లో ఉత్తర్వులు
  •  

    వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని కొత్త పీహెచ్‌సీల్లో పోస్టుల భర్తీ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియను గుట్టుగా సాగించి తీరా రాత్రి పొద్దుపోయాక మీడియాకు వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో ప్రస్తుతం 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

    కొత్తగా విడపనకల్లు మండలం పాల్తూరు, యాడికి మండలం రాయలచెరువు, నార్పల మండలం బి.పప్పూరు, అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట, బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం, గోరంట్ల మండలం కొండాపురం, ముదిగుబ్బ మండలం ములకవేములలో పీహెచ్‌సీలు నిర్మించారు. ఈ ఏడింటికి సంబంధించి ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, ఒక ఫార్మాసిస్ట్‌ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆర్థికశాఖ అనుమతి లభించడంతో గత ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్‌ జారీ చేశారు. 14 వైద్యుల పోస్టులకు 79, స్టాఫ్‌నర్సు పోస్టులు 21కి గాను 1319, ఏడు ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టులకు 420, ఏడు ఫార్మాసిస్ట్‌కు 305 మంది దరఖాస్తు చేసుకున్నారు.

    గత ఏడాది సెప్టెంబర్‌ నాటికే స్క్రూటినీ ముగించారు. అయితే మెరిట్‌ జాబితా విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. అధికారుల వైఖరిపై పత్రికల్లో కథనాలు రావడంలో ఇటీవల అధికారులు మెరిట్‌ జాబితా విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా శనివారం గుట్టుచప్పుడు కాకుండా ఆయా పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌ చేపట్టారు.

    మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్టిఫికెట్లు పరిశీలించారు. డీఎంహెచ్‌ఓతో పాటు డీసీహెచ్‌ఎస్‌ రమేశ్‌నాథ్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కాగా దరఖాస్తు చేసుకున్న వారికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కొందరు హాజరుకాలేదు. దీంతో వారందరికీ జాయినింగ్‌ ఆర్డర్స్‌ను పోస్ట్‌లో పంపారు. ఆరుగురు మెడికల్‌ ఆఫీసర్లు, ఐదుగురు ఫార్మాసిస్టులు, 17 మంది స్టాఫ్‌నర్సులు హాజరయ్యారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు సంబంధించి ఇంకా గందరగోళం ఉండడంతో ఎవరినీ కౌన్సెలింగ్‌కు పిలవలేదు. ఇదిలావుండగా సాధారణంగా వైద్య ఆరోగ్యశాఖలో ఎలాంటి కౌన్సెలింగ్‌ నిర్వహించినా జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ తప్పనిసరి. అయితే ఆయన బిజీగా ఉండడంతో రాలేకపోయారని, కౌన్సెలింగ్‌ను మీరే కొనసాగించాలని చెప్పినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement