‘రంగు’ మారుతోంది! | cost low of mirchi crop | Sakshi
Sakshi News home page

‘రంగు’ మారుతోంది!

May 4 2017 11:27 PM | Updated on Sep 5 2017 10:24 AM

‘రంగు’ మారుతోంది!

‘రంగు’ మారుతోంది!

రాయదుర్గం మండలం టి.వీరాపురం రైతు ఈడిగ వెంకటేశులు రూ.3 లక్షల దాకా పెట్టుబడి పెట్టి ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాడు.

- మిర్చి పంటకు ధరాఘాతం
– నిల్వ చేయడానికి గోదాములు లేవు
– ఇళ్ల వద్ద, తోటల్లో భద్రపరిచిన రైతులు
– ఎండలకు రంగు మారుతోందని ఆవేదన
– ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు


- రాయదుర్గం మండలం టి.వీరాపురం రైతు ఈడిగ వెంకటేశులు రూ.3 లక్షల దాకా పెట్టుబడి పెట్టి ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తొలి విడతగా గ్రేడింగ్‌ చేసుకుని 30 సంచుల మిర్చిని కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. నాణ్యమైన మిర్చి క్వింటాల్‌ రూ.4,199, రెండోరకం రూ.911 పలికింది. మొత్తం 9.50 క్వింటాళ్లకు రూ.13,392 చేతికొచ్చింది. ఇంత తక్కువ ధరతో మిగిలిన మిర్చిని అమ్మలేక, అలాగే ఉంచుకున్నాడు. నిల్వ చేయడానికి గోదాములు లేకపోవడంతో ఇంటి వద్దనే టెంకాయ పట్టలు కప్పి కాపాడుకుంటున్నాడు.

రాయదుర్గం : జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో మిర్చి పంటను అధికంగా సాగు చేశారు.  ఉరవకొండ నియోజకవర్గంలో 24 వేల ఎకరాలు, రాయదుర్గం పరిధిలో 2,250 ఎకరాల్లో పంట వేశారు. బోర్లలో వచ్చే అరకొర నీటితోనే పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. దిగుబడి  కూడా బాగానే వచ్చింది. అయితే..ధర ఉన్నట్టుండి పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యధిక శాతం మంది రైతులు బ్యాడిగ రకం మిర్చి సాగు చేశారు. దీన్ని రాయదుర్గానికి 200 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా బాగల్‌కోట తాలూకా బ్యాడిగ పట్టణానికి  మాత్రమే తీసుకెళ్లి అమ్ముకోవాల్సి ఉంది.

ఈ రకం మిర్చికి మిగతా ఎక్కడా మార్కెటింగ్‌ సౌకర్యం లేదు. ఇక్కడి నుంచి మార్కెట్‌కు రవాణా చేయాలంటే 30 కిలోల బస్తాకు రూ.75దాకా వెచ్చించాల్సి ఉంది. పంటచేతికొచ్చిన తొలినాళ్లలో క్వింటాల్‌  ధర రూ.22 వేల వరకు పలికింది. తీరా పంట పూర్తిస్థాయిలో చేతికొచ్చేసరికి ధర అథఃపాతాళానికి పడిపోయింది. పంటను గిట్టుబాటు ధర వచ్చేవరకు నిల్వ చేసుకుందామనుకున్న రైతులకు ఎక్కడా గోదాముల సౌకర్యం లేదు. దీంతో పొలాలు, ఇంటి ఆవరణల్లో నిల్వ చేసుకున్నారు. మండే ఎండలతో సరుకును సంరక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎండవేడిమికి మిర్చి రంగు మారుతుండటంతో ధర పలకదని ఆందోళన చెందుతున్నారు.  ఇకనైనా ప్రభుత్వం స్పందించి.. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎకరాకు రూ.30 వేల పరిహారమివ్వాలి
  రాయదుర్గం నియోజకవర్గంలో చాలా మంది రైతులు బ్యాడిగ రకం మిర్చి సాగుచేశారు. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల దాకా పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులకైతే మరో రూ. 20వేలు అదనం.  ధరలు ఘోరంగా పడిపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. నిల్వ చేసుకోవడానికి గోదాములు లేవు. గుంటూరు రకం కాకపోవడంతో కర్ణాటకలోనే ఈ పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ విషయం మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులుకు కూడా తెలుసు. తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేల ప్రకారం పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలి.  
- గౌని ఉపేంద్రరెడ్డి , వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement