పితాశ్రీ.. అవినీతి ‘ఎంపరర్‌’, సుతాశ్రీ... వసూళ్ల ‘ప్రిన్స్‌’

పితాశ్రీ.. అవినీతి ‘ఎంపరర్‌’, సుతాశ్రీ... వసూళ్ల ‘ప్రిన్స్‌’ - Sakshi

  • రాష్ట్రంలో రెండేళ్ల టీడీపీ పాలనలో వికృతరూపం దాల్చిన అవినీతి

  • శ్రుతిమించుతున్న చంద్రబాబు, లోకేశ్‌ల అరాచకాలు  

  • అక్రమ మార్గాల్లో రూ.వేల కోట్లు కొల్లగొడుతున్న తండ్రీతనయులు

  • భూములు, ప్రాజెక్టులు, మద్యం, ఇసుక, గనులు.. అన్నిట్లోనూ వాటాలు

  • అక్రమార్జన రుచి మరిగి పరిపాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి

  • అవినీతి సొమ్ముతో నిస్సిగ్గుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోళ్లు

  • సదావర్తి సత్రంలో రూ.978 కోట్లు దోచేశారు



  • గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో విలువైన భూములున్నాయి. వీటిలో కొన్ని ఆక్రమణలకు గురికాగా రూ.83.11 ఎకరాల భూమి మిగిలింది. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.వెయ్యి కోట్లకు పైగానే ఉంటుంది. ఈ భూమిని వేలం వేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. సీఎం కార్యాలయం వెంటనే అనుమతులు ఇచ్చేసింది. భూమి విక్రయానికి అధికారులు వేలంపాట నిర్వహించారు. ఎకరా రూ.13 కోట్లకు పైగా వున్న విలువైన భూమిని రూ.27 లక్షలకే కట్టబెట్టారు.


    మొత్తం 83.11 ఎకరాలను రూ.22.44 కోట్లకే అప్పగించారు. ఈ భూమిని టీడీపీ నేత కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు, మరో ఆరుగురు కలసి కొనుగోలు చేశారు.  భూమి మొత్తం విలువ రూ.వెయ్యి కోట్లు ఉండగా వేలంలో వచ్చిన సొమ్ము రూ.22 కోట్లే. అంటే టీడీపీ నాయకులు రూ.978 కోట్ల మేర లబ్ధి పొందారు. సదావర్తి సత్రం భూములను తక్కువ ధరకే విక్రయించడం వెనుక టీడీపీ బడా నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.



    సాక్షి, హైదరాబాద్‌

    పదేళ్ల తరువాత అధికార పగ్గాలు చేతబట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. లక్షల కోట్ల రూపాయల ఆర్జనే లక్ష్యంగా అవినీతికి గేట్లు తెరిచారు. అవినీతిలో తన రికార్డులను తానే తిరగరాస్తున్నారు. ప్రజల మద్దతుతో గెలవడం కన్నా విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి తిరిగి అధికారంలోకి రావాలనే కుతంత్రంతో పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు ఈ రెండేళ్ల హయాంలో చేసిన అవినీతి ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అవినీతిని మించిపోయింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి రావడమే ఆలస్యం అక్రమార్జనకు శ్రీకారం చుట్టారు.  క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ తమ పార్టీ నేతలను అవినీతి వైపుగా ప్రోత్సహిస్తున్నారు. పదేళ్ల దాహం ఒకేసారి తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు.



    పరిపాలనను గాలికొదిలేసి అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని జేబులు నింపుకోవడానికే ఉపయోగిస్తున్నారు. లంచాలు, ముడుపులు, వాటాలు, కమీషన్లు... ఇలా రకరకాల రూపాల్లో అన్నిచోట్లా బహిరంగంగానే అవినీతి చోటుచేసుకుంటోంది. భూములు, ప్రాజెక్టులు, గనులు, మద్యం, ఇసుక.. ఇలా దేన్నీ వదిలిపెట్టడం లేదు. ఆఖరికి రాజధాని నిర్మాణంలోనూ తమ స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ఇంత బరితెగించిన అవినీతి, అక్రమాలను గతంలో తామెప్పుడూ చూడలేదని ప్రభుత్వ సీనియర్‌ అధికారులే విస్తుపోతున్నారు.



    అగ్రిగోల్డ్‌కు సర్కారు పెద్దల అండ

    లక్షలాది మంది డిపాజిటర్లను ముంచేసిన అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో అధికార పార్టీ నేతల ప్రమేయం బయటపడింది. కుంభకోణం బయటపడకముందే అగ్రిగోల్డ్‌ ఆస్తులను యాజమాన్యం అమ్మేసుకుంది. ఉన్న డబ్బును సొంత ఖాతాలకు మళ్లించుకుంది. ఇదంతా ప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలతోనే చేయగలిగింది. ఈ కుంభకోణం విలువ రూ.10 వేల కోట్లు. ఇంతపెద్ద కుంభకోణం జరిగినా కోర్టుల జోక్యం చేసుకునే వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి అరెస్టులు చేయలేదు. హైకోర్టు గట్టిగా మందలించడంతో చివరికి గత్యంతరం లేక అరెస్టులు ప్రారంభించింది. డిపాజిటర్ల సొమ్ముతో అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కొనుగోలు చేసిన కొన్ని భూములను ప్రభుత్వ పెద్దలు అక్రమంగా దక్కించుకున్నారు.



    ఇరిగేషన్‌లో రూ.6 వేల కోట్ల లూటీ

    గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా సుజల స్రవంతి, గోరకల్లు పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. ఆ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. పాలనాపరమైన అనుమతులేవీ తీసుకోకుండానే టెండర్లు పిలిచారు. 25 ప్యాకేజీల్లో టెండర్లు పిలిస్తే విచిత్రంగా అన్ని పనులు అధికార పార్టీ ఎంపీ సీఎం రమేశ్, ఇతర టీడీపీ నాయకులకే దక్కాయి. ఈ వ్యవహారంలో రూ.6 వేల కోట్లు నొక్కేయడానికి రంగం సిద్ధమైపోయింది. దీనిపై సంతకాలు చేయడానికి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ప్రస్తుత సీఎస్‌ టక్కర్‌ ఇరువురూ మూడుసార్లు తిరస్కరించారు.


    అయినా ప్రభుత్వ పెద్దలు వెనక్కి తగ్గలేదు. ఈ అవినీతి పర్వానికి ‘మంత్రివర్గం ఆమోదం’ పేరిట విజయవంతంగా ఆమోద ముద్ర వేయించింది. తమకు కావాల్సిన ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌) విధానానికి స్వస్తి పలికారు. జీవో నం.22ను తీసుకొచ్చారు. ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లకు రూ.3 వేల కోట్లు అదనంగా చెల్లించారు. ఈ వ్యవహారంలో రూ.1,500 కోట్ల సొమ్ము చేతులు మారింది.



    ఆర్థికశాఖ నివేదికను పక్కనపెట్టి..

    ప్రైవేట్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు గ్యాస్‌పై వ్యాట్‌ రాయితీ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రెండేళ్లలో రూ. 2,300 కోట్లు నష్టం వాటిల్లుతుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసినప్పటికీ సీఎం చంద్రబాబు లెక్కచేయలేదు. వ్యాట్‌పై రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక బడా కార్పొరేట్‌ సంస్థల నుంచి అందిన ముడుపులే కారణమని విశ్వసనీయ సమాచారం. ఇక సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్‌కు అనుమతిస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి పాలనలో గవర్నర్‌ తాత్కాలికంగా నిలుపుదల చేయగా బాబు అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లతో మరీ సంప్రదింపులు జరిపి ఎస్కలేషన్‌కు ఏకంగా రూ.17,967 కోట్లు చెల్లించేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఎత్తున కమీషన్లు అందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.



    అనుచర గణానికి దోచిపెట్టేందుకు..

    చంద్రబాబు తనకు కావాల్సిన వారికి మేలు చేయడానికి పాత పారిశ్రామిక రాయితీ బకాయిల పేరుతో గత ఆర్థిక సంవత్సరం చివర్లో ఏకంగా రూ.2,067 కోట్లు విడుదల చేశారు. ఓవర్‌ డ్రాఫ్టులో ఉన్న సమయంలో ఇలా నిధులు విడుదల చేయడానికి కారణం ప్రభుత్వ పెద్దలకు భారీగా కమీషన్‌ ముట్టడమేనని అధికార యంత్రాంగం కోడై కూస్తోంది. ఈ మొత్తంలో 30 శాతం వరకు చిన్నబాబుకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక రాయితీల చెల్లింపులపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.



    ఇసుకలో బాబు, లోకేశ్‌లకు రూ.2,637 కోట్లు

    రాష్ట్రవ్యాప్తంగా మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇసుక ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడం కోసమే ఇసుక సరఫరా బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించామని అప్పట్లో చంద్రబాబు చెప్పారు. అయితే డ్వాక్రా సంఘాల ముసుగులో ఇసుక అక్రమ తవ్వకాలు, అమ్మకాలను అధికార పార్టీ నేతలే సాగించారు. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 75 శాతం, రాయలసీమ జిల్లాల్లో 90 శాతం మేరకు ఇసుకను మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల అనుచరులే అనధికారికంగా అమ్ముకున్నారు. రూ.కోట్లు జేబుల్లో నింపుకున్నారు. ఇసుక వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి వాస్తవంగా రావాల్సిన ఆదాయం రూ.4,480 కోట్లు కాగా, వచ్చింది రూ.964 కోట్లు మాత్రమే. అంటే అక్రమార్కులు మింగేసిన సొమ్ము రూ.3,516 కోట్లు. ఇందులో 75 శాతం.. అంటే రూ.2,637 కోట్లు సీఎం చంద్రబాబు, లోకేశ్‌ల జేబుల్లోకి వెళ్లాయి.



    అంతటా అవినీతి కంపే

    పట్టాదారు పాసుపుస్తకాన్ని ఈ–సేవ ద్వారా పొందాలని ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడా కూడా ఈ–సేవ ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదు. ఎమ్మార్వోకు పట్టాదారు పాసుపుస్తకం కోసం రూ.25 వేల వరకు ఇవ్వాల్సి వస్తోంది. ఇందులో ఎమ్మెల్యేలకు కూడా వాటా ఇవ్వాల్సి ఉందని ఎమ్మార్వోలు బహిరంగంగా చెప్పడం గమనార్హం. గతంలో ఉన్న రేషన్‌ దుకాణాల డీలర్లను జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తొలగించి, రూ.3 లక్షల వరకూ తీసుకుని కొత్త వారిని డీలర్లుగా నియమించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ–సేవా కేంద్రాలను కూడా వదల్లేదు, ఒక్కో ఈ–సేవా కేంద్రం నుంచి నెలకు రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఉద్యోగుల బదిలీలను చంద్రబాబు నాయుడు అధికారికంగానే రాజకీయ వ్యవస్థీకృత బదిలీలుగా మార్చేశారు. ఆర్‌డీవో, తహసీల్దార్ల బదిలీల విషయంలో చిన్నబాబు జోక్యం మితిమీరుతోంది.  


    • కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో రూ.250 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.4.99 కోట్లకే వీబీసీ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ సంస్థకు ప్రభుత్వం రాసి ఇచ్చేసింది. ఈ కంపెనీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకుడుది కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో సీఎం బంధువుకు రూ.245 కోట్ల మేర లబ్ధి కలిగింది.

    • విశాఖపట్నంలోని మధురవాడలో రూ.363 కోట్ల విలువైన భూమిని నారా లోకేశ్‌ మిత్రుడికి చెందిన ఈ–సెంట్రిక్‌ సొల్యూషన్‌కు రూ.25 కోట్లకే కట్టబెట్టారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.338 కోట్ల నష్టం వాటిల్లింది.

    • మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన మంగళ్‌ ఇండస్ట్రీస్‌ సంస్థకు ప్రభుత్వం తిరుపతిలో అత్యంత విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. రూ.43.38 కోట్ల విలువైన భూమిని కేవలం 4.88 కోట్లకే ధారాదత్తం చేసింది. గల్లా అరుణకుమారి మంత్రిగా చేయించుకోలేని పనిని చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆమెకు చేసి పెట్టారు.

    • నెల్లూరు బ్యారేజీ కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు జరిపేందుకు ఇరిగేషన్‌ నిబంధనలను తుంగలో తొక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కాంట్రాక్టర్‌కు రూ.22.68 కోట్లు అదనంగా చెల్లించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో రూ.10 కోట్లు చేతులు మారాయి.

    • గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1,217 కోట్ల నిధులను చంద్రబాబు సర్కారు నామినేషన్‌ పద్ధతిలో టీడీపీ నేతలకు కట్టబెడుతోంది. కేంద్ర నిధులతో ‘వాడవాడలా చంద్రన్న బాట’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది.

    • రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన నీరు–చెట్టు కార్యక్రమం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు కల్పతరువుగా మారిపోయింది. ఈ పథకం పనులను టెండర్లు పిలవకుండానే నామినేషన్‌ విధానంలో కట్టబెడుతున్నారు. నీరు–చెట్టు పేరుతో ప్రపంచబ్యాంకు నుంచి గతంలో రూ.1,400 కోట్ల అప్పు తెచ్చారు. ఇందులో రూ.700 కోట్ల విలువైన పనులు చేసి, మిగతా సొమ్ము దోచుకున్నారు. ఈసారి మాత్రం 25 శాతం పనులే చేశారు. మిగతా 75 శాతం సొమ్మును మింగేశారు.

    • రాష్ట్ర విభజన జరిగిన నాటికి రైస్‌ మిల్లర్లకు బకాయిపడిన రూ.500 కోట్ల వ్యాట్‌ బకాయిలను మాఫీ చేస్తూ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక నారా లోకేశ్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బకాయిల రద్దు వల్ల ఆయనకు రూ.200 కోట్లకు పైగా ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    • సంక్రాంతి పండుగ సమయంలో అధికార పార్టీ నాయకులు చంద్రన్న కానుక పేరుతో ప్రజలకు నాణ్యత లేని సరుకులను అంటగట్టి రూ.100 కోట్ల వరకు వెనకేసుకున్నారు. కాంట్రాక్టర్లు పురుగులు పట్టిన కందిపప్పు, తినడానికి వీలు లేని బెల్లం, గోధుమ పిండి సరఫరా చేసినా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

    • వేసవిలో వడగాడ్పుల నుంచి ప్రజలను కాపాడే పేరిట చంద్రబాబు తన హెరిటేజ్‌ కంపెనీకి రూ.39 కోట్లు దోచిపెట్టారు. ప్రజలకు మజ్జిగ సరఫరా చేయడానికి జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున కేటాయించారు. టెండర్లేవీ పిలవకుండానే, హెరిటేజ్‌ సంస్థ నుంచే మజ్జిగను కొనుగోలు చేశారు. ఇతర సంస్థలు తక్కువ ధరకే మజ్జిగను సరఫరా చేసే అవకాశం ఉన్నా హెరిటేజ్‌కే లబ్ధి చేకూర్చారు.

    • గతేడాది జూలైలో గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.750 కోట్లు అధికార పార్టీ నేతల జేబుల్లోకే వెళ్లాయి. పుష్కరాల పనులను నామినేషన్‌ పద్ధతిలో టీడీపీ నాయకులే పంచుకున్నారు.




    పోలవరంలో దోపిడీకి అడ్డేదీ?

    రాష్ట్ర ప్రజలకు వరప్రదాయిని లాంటి పోలవరం ప్రాజెక్టును సర్కారు పెద్దలు బంగారు బాతుగా మార్చుకున్నారు. 2010–11లో సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.16 వేల కోట్లు. దీనికి ప్రణాళిక సంఘం ఆమోదముద్ర కూడా వేసింది. అయితే, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.31 వేల కోట్లకు పెంచేసింది. ఇందులో అత్యధిక వాటా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లనుందని సమాచారం. అవినీతికి ఆస్కారం కల్పిస్తూ ప్రభుత్వం పోలవరం పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించింది.


    అంచనా వ్యయం పెంచడం వల్ల ముఖ్యమంత్రి మనుషులు లబ్ధి పొందుతుండగా అంతిమంగా నష్టపోయేది ప్రజలే. పోలవరం ప్రాజెక్టులో భాగమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. పట్టిసీమ వ్యయాన్ని ఏకంగా రూ.1,600 కోట్లకు పెంచారు. ముఖ్యమంత్రికి బాగా కావాల్సిన సంస్థకే ఈ పనులు దక్కాయి. ఇందులో చంద్రబాబు, లోకేశ్‌లకు రూ.710 కోట్లు ముట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.



    అదనపు మద్యంలో ముడుపులు!

    రాష్ట్రంలో మద్యాన్ని గరిష్ట చిల్లర ధర(ఎంఆర్‌పీ) కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు మద్యం సిండికేట్‌ ప్రతినెలా ప్రభుత్వ పెద్దలకు రూ.100 కోట్లకుపైగా ముడుపులు ముట్టజెబుతోంది. అంటే రెండేళ్లలో రూ.2,400 కోట్లు సర్కారు పెద్దల జేబుల్లోకి వెళ్లాయి. అలాగే రాష్ట్రంలో మద్యం కొరత పేరుతో అదనపు మద్యం ఉత్పత్తికి డిస్టిలరీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. దరఖాస్తు చేసుకున్న 12 డిస్టిలరీలలో నాలుగు డిస్టిలరీలకే అనుమతులిచ్చారు. ఈ వ్యవహారంలో రూ.400 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. సర్కారే మద్యం షాపులను నిర్వహించేలా మద్యం పాలసీని తీసుకొస్తామన్న టీడీపీ ప్రభుత్వం చివరకు ప్రైవేట్‌ వ్యక్తులకే ఈ వ్యాపారాన్ని అప్పగించింది. ఇందుకుగాను మద్యం సిండికేట్‌ నుంచి టీడీపీ ప్రముఖులకు రూ.1,000 కోట్లు ముట్టినట్లు తెలుస్తోంది.



    లోకేశ్‌ సమాంతర పాలన

    అవినీతి సామ్రాజ్యానికి చంద్రబాబు నాయుడు చక్రవర్తిగా వ్యవహరిస్తుండగా, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ రాజ్యాంగేతర శక్తిగా మారి చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలనే ప్రభావితం చేసేస్థాయికి చేరుకున్నారు. దాదాపు సమాంతర పాలన కొనసాగిస్తున్నారు. చిన్నబాబు అనుమతి లేనిదే ఫైల్‌ కూడా ముందుకు కదలని పరిస్థితి. చిన్నబాబు సచివాలయంలో సమాంతర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారిని మంత్రులని పిలవకుండా మీడియా లైజనింగ్‌ ఆఫీసర్లని పిలుస్తున్నారు. వీరి ద్వారా చిన్నబాబు మంత్రులతో, సంబంధిత అధికారులతో కావాల్సిన పనులను చేయిస్తున్నారు.


    చిన్నబాబు కరడుగట్టిన వసూల్‌ రాజాగా అవతరించారు. రాష్ట్రంలో పెద్దబాబు, చిన్నబాబు కలసి రెండేళ్లలోనే అక్రమ మార్గాల్లో అంతులేని సంపద కూడబెట్టారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అడ్డదారిలో సంపాదించిన సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొనేస్తున్నారు. టీడీపీలో చేరితో రూ.40 కోట్లదాకా నగదు, పదవులు, కాంట్రాక్టులు, విలువైన భూములు ఇస్తామంటూ వల వేస్తున్నారు. ఇప్పటివరకు 17 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని తన పార్టీలో చేర్చుకున్నారు. రాజ్యాంగంలో భాగమైన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు.





    చంద్రబాబు తాజా కుంభకోణాలు                  (రూ.కోట్లలో)



    రాజధాని పేరుతో దోపిడీ                            1,00,000

    అగ్రిగోల్డ్‌ కుంభకోణం                                  10,000

    ఇరిగేషన్‌లో లూటీ                                   6000

    లిక్కర్‌ సిండికేట్ల నుంచి బహుమతులు         5,800

    పవర్‌ ప్రాజెక్టుల్లో ముడుపులు                      4,000

    ఇసుక మాఫియా నుంచి వసూళ్లు                 2,637

    పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు       3,000

    పారిశ్రామికవేత్తలకు అదనపు రాయితీలు        2,500

    నీరు–చెట్టు పథకంలో దోపిడీ                         1,800

    ఈపీసీని ఉల్లంఘించినందుకు ప్రయోజనాలు    1,500

    బినామీకి ఫైబర్‌ ఆప్టిక్‌ గ్రిడ్‌ కాంట్రాక్ట్‌                 1,400

    సదావర్తి సత్రం భూముల కైంకర్యం                     978

    కేంద్రం నిధుల దుర్వినియోగం                           900

    గోదావరి పుష్కరాల్లో నిధుల వృథా                     750

    పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ముడుపులు          710

    ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్రాజెక్టుల్లో అవినీతి                  670

    నామినేషన్‌ పద్ధతిలో తెలుగు తమ్ముళ్లకు పనులు    500

    బెరైటీస్‌ మైనింగ్‌లో ముడుపులు                          390

    లోకేశ్‌ మిత్రుడికి నామమాత్రపు ధరకే భూమి          338

    సీఎం బంధువుకి బహుమతి                               245

    వంశధార ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు ప్రయోజనాలు      214

    బొగ్గు దిగుమతుల నుంచి ముడుపులు                200

    మిల్లర్లతో లోకేశ్‌ బేరం                                        200

    సోలార్‌ టెండర్లలో గోల్‌మాల్‌                               155

    గాలేరునగరి, అవుకు ప్రాజెక్టుల్లో అదనపు చెల్లింపులు    153

    టీడీపీ నేతకు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు           120

    ఎన్టీఆర్‌ ట్రస్టుకు జిల్లాల్లో భూములు                      100

    పత్తి కుంభకోణంలో మంత్రి వాటా                          100

    చంద్రన్న కానుక పథకం నుంచి వసూళ్లు               100

    ‘గల్లా’ కుటుంబానికి భూముల బహుమతి               40

    చంద్రన్న మజ్జిగ స్రవంతి                                       39

    నెల్లూరు బ్యారేజ్‌ పనుల్లో అవినీతి                           10

    మొత్తం కుంభకోణాల విలువ                         1,45,549

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top