ముస్లింలకు తోఫా కాదు.. ధోకా | Chandrababu Government Fails to Keep Its Promise Regarding the Ramadan Gift | Sakshi
Sakshi News home page

ముస్లింలకు తోఫా కాదు.. ధోకా

Mar 21 2026 5:36 AM | Updated on Mar 21 2026 5:36 AM

Chandrababu Government Fails to Keep Its Promise Regarding the Ramadan Gift

రంజాన్‌ తోఫాపై మాట నిలుపుకోని చంద్రబాబు ప్రభుత్వం 

ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం దరఖాస్తులు 22 నెలలుగా పెండింగ్‌ 

చంద్రన్న పెళ్లి కానుక, ఇస్లామిక్‌ బ్యాంక్, 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఊసేలేదు 

వక్ఫ్‌ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా చోద్యం 

ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే అన్నీ చేసినట్టు అబద్ధాలు 

పవిత్ర రంజాన్‌ వేళ బాబు దగాను గుర్తు చేసుకుంటున్న ముస్లింలు 

సాక్షి, అమరావతి :  ముస్లింలకు రంజాన్‌ తోఫా ఇస్తానంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మరోసారి ధోకా ఇచ్చారు. గత ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండానే, ఇటీవల ఇఫ్తార్‌ విందులో అన్నీ చేసేసినట్టు అబద్ధాలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ముస్లింలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యాక్రమాలను కూడా తానే చేసినట్టు బాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడిన తీరును ముస్లిం నేతలు తప్పు పడుతున్నారు. 

ఇమామ్‌కు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేలు ఉన్న గౌరవ వేతనాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలకు పెంచింది. వక్ఫ్‌ చట్ట సవరణను వ్యతిరేకించి, ముస్లింల పక్షాన ఉన్న వైఎస్‌ జగన్‌ తన హయాంలో వక్ఫ్‌ ఆస్తుల సర్వే నిర్వహించి, అన్యాక్రాంతమైన వాటిని కాపాడి, వేలాది వక్ఫ్‌ ఆస్తులను డిజిటలైజ్‌ చేయించారు. 

రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు వివిధ పథకాల కింద డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఏకంగా రూ.20,863.40 కోట్ల లబ్ధి చేకూర్చారు. తద్వారా ముస్లింలను రాజకీయంగా, ఆరి్థకంగా, సామాజికంగా ముందుకు నడిపించారని ముస్లిం సమాజం చర్చించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన దగాను గుర్తు చేసుకుంటున్నారు. 

చంద్రబాబు మోసాలివీ
»  మసీదులకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చులు ఇస్తామన్న హామీ ఊసేలేదు.   
»  ఇమామ్, మౌజన్లకు నెలల తరబడి గౌరవ వేతనాలు పెండింగ్‌. బక్రీద్, రంజాన్‌ ముందు హడావుడిగా అరకొరగా విడుదల. 
»  22 నెలలుగా 1,500 మసీదులకు చెందిన ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం దరఖాస్తులు పెండింగ్‌.   
»  గత ప్రభుత్వ హయాంలో నియమించిన వక్ఫ్‌ బోర్డు రద్దు. నూతన వక్ఫ్‌ బోర్డులో మతపరమైన సాహితీ వేత్తలకు ఇవ్వాల్సిన డైరెక్టర్‌ పోస్టులను టీడీపీ నేతలకు కట్టబెట్టిన వైనం. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన రాజమహేంద్రవరానికి చెందిన ముస్లిం ప్రతినిధి.  
»   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టానికి మద్దతు పలికిన చంద్రబాబు సర్కారు. రాష్ట్రంలో వక్ఫ్‌ బోర్డు ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా అన్యాక్రాంతం చేసేందుకు ఆస్కారం కల్పిస్తూ.. మరోవైపు వాటిని రక్షిస్తున్నట్టు బిల్డప్‌.  
»   అధికారంలోకి వచ్చిన వెంటనే దూదేకుల ముస్లిం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి.. ఏడాది తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఆమోదం. మరో ఆరు నెలలకు తీరుబడిగా జీఓ ఇచ్చి.. ఇస్తామన్న రూ.100 కోట్లు ఇప్పటి వరకు కేటాయించలేదు.  
»  రాష్ట్రంలో ఈద్గాలు, ఖబర్‌స్తాన్‌లకు భూములు కేటాయింపు, ముస్లింలకు ఆటోనగర్‌ల ఏర్పాటు హుళక్కే.  
»  2024 హజ్‌ యాత్రకు వెళ్లిన వారికి గత ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు సైతం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చెల్లించలేదు. 
» హజ్‌ యాత్రకు వెళ్లిన వారికి రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చి.. 2025లో వెళ్లిన వారందరికీ కాకుండా విజయవాడ నుంచి వెళ్లిన వారికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపు
కొన్నారు.  
» మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. 
»   చంద్రన్న పెళ్లి కానుక, ఇస్లామిక్‌ బ్యాంక్, 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్, విదేశీ విద్య పథకం తదితర హామీలు అమలు చేయకుండా మరో సారి మోసం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement