కీర్తిచోరుడు చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ
తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై వైఎస్ జగన్ పాలనలోనే ప్రత్యేక దృష్టి
అప్పట్లోనే తిరుమలకు ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌ను మంజూరు చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
అధికారికంగా నేడు ప్రారంభం
ఆ ల్యాబ్‌ను తామే తెచ్చామంటూ ఇప్పుడు గొప్పలు ప్రచారం చేసుకుంటున్న బాబు సర్కార్
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. తిరుమలలో స్వామివారి ప్రసాదంలో వాడే ముడిపదార్థాలు, భక్తులకు పెట్టే అన్నప్రసాదాల్లో నాణ్యతను పెంపొందించేందుకు శనివారం ప్రారంభం కానున్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు తానే కారణమన్నట్లు ప్రచారం చేసుకుంటూ, స్వయంగా శ్రీవెంకటేశ్వరుని సాక్షిగా బాబు సర్కార్ తాజాగా క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది.
జగన్ ప్రభుత్వ చొరవతో ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రత్యేకంగా తిరుమలకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను మంజూరు చేస్తే అది తన ఘనతగా చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే..

» 2023 ఆగస్టు 23, 24 తేదీల్లో 41వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తిరుపతిలో నిర్వహించింది. సమావేశానికి హాజరైన సీఈవో కమలవర్ధన్‌రావు ఈ సందర్భంగా తిరుమలలో పర్యటించారు. అన్నప్రసాద భవనాన్ని, శ్రీవారి లడ్డూ పోటును స్వయంగా సందర్శించారు. టీటీడీ అధికారులతో సైతం సమావేశం నిర్వహించారు.
» అప్పటికే భక్తులకు ఇచ్చే ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం... తిరుమలకు ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను మంజూరు చేయాలని సీఈవోను కోరింది.
» దీంతో భక్తులకు వడ్డించే ఆహారం, లడ్డూ తయారీలో వాడే నెయ్యి, పాలు, సుగంధ ద్రవ్యాల స్వచ్ఛతను పరీక్షించడానికి టీటీడీకి సొంతంగా అధునాతన ల్యాబ్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తరపున మంజూరు చేస్తున్నట్లు మీడియా సాక్షిగా కమలవర్ధన్‌రావు ప్రకటించారు.
» వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ల్యాబ్ ఏర్పాటుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముందుకు రావడంతో, ల్యాబ్ ఏర్పాటు కోసం ఆనాటి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కసరత్తు కూడా ప్రారంభించారు.
» ల్యాబ్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకు ప్రతిపాదనలు కూడా పంపారు.
» గత ప్రభుత్వంలో జరిగిన కృషి కారణంగా రూ.20 కోట్లతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్ ఏర్పాటయ్యింది.
» అదంతా తన గొప్పేనంటూ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ చేస్తున్న హడావుడి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.


