
శాంతి పరిరక్షకులుకండి
ప్రపంచంలో శాంతి నెలకొనడానికి ప్రజలంతా శాంతిపరిరక్షకులుగా మారి ముందడుగు వేయాలని పోప్ ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో పిలుపునిచ్చారు.
ప్రపంచ ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ సందేశం
దక్షిణ సూడాన్‌లో శాంతి నెలకొనాలి
చర్చల ద్వారా యుద్ధాల్ని నియంత్రించాలి
బెత్లెహాంలో ఘనంగా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు
వాటికన్ సిటీ/బెత్లెహాం/న్యూఢిల్లీ: ప్రపంచంలో శాంతి నెలకొనడానికి ప్రజలంతా శాంతిపరిరక్షకులుగా మారి ముందడుగు వేయాలని పోప్ ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో పిలుపునిచ్చారు. దక్షిణ సూడాన్ సంక్షోభంతో సహా ప్రపంచంలో ఉన్న యుద్ధ పరిస్థితులన్నీ చర్చలతోనే చక్కదిద్దాలని సూచించారు. ఈ ఏడాది మార్చి 13న పోప్‌గా ఎన్నికైన తర్వాత 77 ఏళ్ల ఫ్రాన్సిస్.. సెయింట్ పీటర్స్ బాసిలికా బాల్కనీ నుంచి తన తొలి ‘ఉర్బియెట్ ఒర్బి’ (పట్టణానికి, ప్రపంచానికి) సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మందితో సెయింట్ పీటర్స్ స్క్వేర్ నిండిపోయింది. మానవుడి దురాశతో పర్యావరణానికి చేటు కలుగుతోందని ఈ సందర్భంగా పోప్ పేర్కొన్నారు.
దక్షిణ సూడాన్‌లోని ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఎంతో మంది బాధితులుగా మిగులుతున్నారని, కొత్తగా ఏర్పడిన ఆ దేశంలో సాంఘిక సామరస్యం ఏర్పడాలని కోరారు. అలాగే సిరియా, నైజీరియా, కాంగో రిపబ్లిక్, ఇరాక్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల్ని చర్చలతో పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి నెలకొనడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావాలని జీసస్‌ను ప్రార్థించారు. యుద్ధాలు చాలా మంది జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తాయన్నారు. దేవుడంటే శాంతి అని, శాంతి పరిరక్షకులుగా కావడానికి ఆయన సహాయాన్ని అర్థిద్దామని అన్నారు. బెత్లెహాంలో జీసస్ పుట్టుక ప్రపంచానికి ఒక శాంతి సందేశమని చెప్పారు.
బెత్లెహాంలో క్రిస్మస్ సందడి
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా.. జీసస్ పుట్టిన వెస్ట్ బ్యాంక్‌లోని బెత్లెహాం క్రిస్మస్ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. కొన్ని దశాబ్దాల్లో లేనంతగా ఎక్కువ మంది ప్రజలు క్రిస్మస్ వేడుకకు హాజరయ్యారు. క్రీస్తు భక్తులతో ప్రఖ్యాత మాంగెర్ స్క్వేర్ నిండిపోయింది.
భారత్‌లోనూ ఉత్సాహంగా క్రిస్మస్
దేశ వ్యాప్తంగా క్రైస్తవులు కుటుంబ సమేతంగా క్రిస్మస్ ప్రార్థనల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టార్లతో, ట్రీలతో చర్చిలను అందంగా అలంకరించారు. ఢిల్లీలో అర్ధరాత్రి కూడా షాషిం గ్ మాల్స్‌లో సందడి కనబడింది. కన్నాట్ ప్లేస్, ఇండియాగేట్ వద్ద చేరిన ప్రజలు శుభాకాంక్షలు పంచుకున్నారు. కోల్‌కతా, తమిళనాడు, మేఘాలయ, కాశ్మీర్ ఇలా దేశ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు.