ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం..

Young Man Suicide By Drinking Poison At Wanaparthy - Sakshi

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు భూమినిచ్చిన వైనం

అయినా ఉద్యోగం ఇవ్వని విద్యుత్‌ అధికారులు

వనపర్తి క్రైం: సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం ఇస్తామని చెప్పిన విద్యుత్‌ అధికారుల మాటలు నమ్మి తనకున్న భూమిని వారికి అప్పగించాడు. తీరా అధికారులు ఇచ్చిన మాట నెరవేర్చకపోయే సరికి ఏం చేయాలో తెలియక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా చందాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోటపోతు బాలరాజు (28), శివరాములు ఐటీఐ పూర్తి చేశారు. ఆరేళ్ల కిత్రం గ్రామానికి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ మంజూరైంది.

దీని ఏర్పాటుకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో.. భూమి సమకూరిస్తే ఉద్యోగాలు ఇస్తామని అధికారులు చెప్పడంతో 2016లో గ్రామస్తులు అంగీకరించారు. దీంతో ఉద్యోగం కోసం బాలరాజు తల్లిదండ్రులను ఒప్పించి తనకున్న ఎకరన్నర భూమిని అమ్మాడు. శివరాములు వద్ద ఉన్న డబ్బులు, బాలరాజు భూమి అమ్మిన డబ్బులు కలిపి మరోచోట సర్వే నం.58లో 30 గుంటలను కొనుగోలు చేసి అదే ఏడాది మార్చి 29న వనపర్తి డీఈ తాళ్లపల్లి లింగయ్యకు అప్పగించారు. అయితే సబ్‌స్టేషన్‌ ప్రారంభమైనా ఇంతవరకు వారిద్దరికీ ఉద్యోగాలు రాలేదు.

మరో పది రోజుల్లో పెళ్లి.. 
అధికారులు ఇస్తామన్న ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో శనివారం రాత్రి కుంగిపోయాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామంలోని నీటిట్యాంకు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. బాలరాజుకు ఈ నెల 14న పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆదివారం పెళ్లి దుస్తులు తీసుకోవాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యోగం ఇస్తామని చెప్పిన అధికారులు మాట తప్పినందుకే బాలరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతదేహాన్ని ప్రధాన రహదారిపై ఉంచి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో శాంతించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పరామర్శించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top