అమ్మాయిలా నటిస్తూ..

young man harraement to girls on facebook fake id  - Sakshi

ఫేస్‌బుక్‌లో యువతులకు వేధింపులు

హారికరెడ్డి అనే నకిలీ ఐడీతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు

నగ్న చిత్రాలు, అసభ్యకర సందేశాలు పంపిస్తూ బెదిరింపులు

నిందితుడు దుర్గాప్రసాద్‌ అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: అమ్మాయిగా నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీ క్రియేట్‌ చేసి ఫ్రెండ్‌ లిస్ట్‌లో యాడ్‌ అయిన మహిళలు, అమ్మాయిలకు నగ్నచిత్రాలు, అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త పట్ల ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడటంతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని  హైదరాబాద్‌ ఆదర్శ్‌నగర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి  సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ రౌటర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ కథనం ప్రకారం...నిందితుడు దుర్గాప్రసాద్‌ బీఫార్మసీ  పూర్తి చేశాడు. కడపకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి పగ పెంచుకున్న అతను హారికరెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీ క్రియేట్‌ చేసి ఆమె ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొని అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడు.

కొన్ని రోజుల తర్వాత ఆమె అతడిని బ్లాక్‌ చేయడంతో అప్పటి నుంచి మహిళలు, అమ్మాయిలకు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపడం మొదలెట్టాడు. ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన నగ్నచిత్రాలు, సెల్ఫీ వీడియోలను పంపుతూ అమ్మాయి అనేలా నమ్మించేవాడు. జూలై నెలలో మియాపూర్‌ ఠాణాలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. అయినా తీరుమారని నిందితుడు అసభ్యకర ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా అడ్‌ అయిన మహిళలకు పంపేవాడు. అతడి ఫ్రెండ్‌ లిస్ట్‌లో దాదాపు 958 మంది అమ్మాయిలుండగా వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలే అధికం కావడం గమనార్హం. ఇదే తరహాలో ఫెమినిస్టు, రాజకీయ పార్టీకి చెందిన ఓ  మహిళా కార్యకర్తకు హారికరెడ్డి ఐడీ నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. దానిని ఓకే చేసిన బాధితురాలికి కొన్ని రోజుల తర్వాత అసభ్యకర ఫొటోలు, అభ్యంతరక వ్యాఖ్యలు వచ్చాయి.

అలాంటివి ఎందుకు పంపిస్తున్నావని అరా తీయగా, అదే ఐడీ నుంచి వాయిస్‌ కాల్‌ మెసేంజర్‌ వచ్చింది. అయితే ఐడీ అమ్మాయి పేరు కనబడుతున్నా, గొంతు మాత్రం అబ్బాయిదిగా వినిపించింది. ఆ తర్వాత వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, వివిధ సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్టు చేసి పరువు తీస్తానని బెదిరించడంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌ అధికారులు ఇచ్చిన ఇన్‌పుట్స్‌ ఆధారంగా నిందితుడు హైదరాబాద్‌ ఆదర్శ్‌నగర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌గా గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.  ఇతడి వల్ల మరెవరైనా మోసపోయారా, వేధింపులకు గురయ్యారా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top