ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

Young Cricketer Suicide In Kurnool - Sakshi

తండ్రి బైక్‌ ఇవ్వలేదనే క్షణికావేశంతో క్రికెటర్‌ ఆత్మహత్య 

శోకసంద్రంలో కుటుంబం

సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : భవిష్యత్‌ ఉన్న కుర్రాడు.. ఆటలో విజయ పరంపర సాగిస్తున్న క్రీడాకారుడు . రెండు రోజుల్లో బెంగళూరులో జరిగే రాష్ట్రస్థాయి అండర్‌19 జట్టులో ఆడాల్సిన ఆటగాడు అర్ధంతరంగా ప్రాణం తీసుకున్నాడు. తండ్రి బైక్‌ ఇవ్వలేదనే క్షణికావేశంలో ఉరి వేసుకొని ఊపిరి తీసుకున్నాడు. పట్టణంలోని ఎస్‌ఎంటీ కాలనీలో శనివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన ఖాసీంనాయుడు, సరస్వతికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌నాయుడు(19) స్థానిక శ్రీ రాఘవేంద్ర కాలేజీలో ఇంటర్‌ సీఈసీ రెండో ఏడాది చదువుతూ క్రికెట్‌లో రాణిస్తున్నాడు.

రాష్ట్రస్థాయి అండర్‌–19 పోటీలకు ఎంపికయ్యాడు. శిక్షణ శిబిరానికి ఈ నెల 8న బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే శుక్రవారం ఆదోనిలో జరిగే వినాయక నిమజ్జన వేడుకలకు వెళ్లేందుకు తనకు బైక్‌ ఇవ్వాలని తండ్రి ఖాసీంనాయుడుకు ఫోన్‌ చేసి అడిగాడు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుడైన తండ్రి తాను పనిలో ఉన్నానని, బైక్‌ ఇవ్వడం వీలు కాదని, ఎక్కడికీ వెళ్లవద్దని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. అయినా స్నేహితుల బైక్‌పై వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి బెడ్‌ రూంలో నిద్రించాడు. తల్లి సరస్వతి బ్యూటీ పార్లర్‌ శిక్షణ నిమిత్తం కర్నూల్‌కు వెళ్లింది. తండ్రి విధులు ముగించుకొని ఆలస్యంగా వచ్చి భోంచేసి పడుకున్నాడు. ఉదయం ఎంతకూ బెడ్‌రూం తలుపులు తీయకపోవడంతో కిటికిలోంచి చూడగా కుమారుడు ఉరికి వేలాడుతుండడంతో తండ్రి కుప్పకూలిపోయాడు. ఇంటి పక్కల వారి సాయంతో కుమారుడిని కిందకు దించి మృతదేహాన్ని స్వగ్రామం హాలహర్వికి తీసుకెళ్లారు. చేతికి వచ్చిన కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.   ఇది చదవండి : కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top