
జహీరాబాద్: కర్ణాటకలో జరిగిన కారు ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. గురువారం బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకా పరిధిలోని నిర్ణ క్రాస్‌రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. మన్నాఎక్కెల్లి ఎస్.ఐ సునీత మార కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌కుమార్ భార్య, కుమారులతో కలసి మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు వైద్యం కోసం వెళ్లాడు. వైద్యం చేయించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యాడు. నిర్ణ సమీపంలో 65వ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఉదయ్ కారును నిలిపి కుమారులు జీవన్‌కుమార్, గగన్‌కుమార్‌లను బయటకు తీశాడు. భార్య కల్యాణి (39)ని కూడా బయటకు తీసే ప్రయత్నం చేయగా ఆమె సీటు బెల్టు ధరించి ఉండటంతో సాధ్యం కాలేదు. ఈలోగా మంటలు మరింత వ్యాపించడంతో కల్యాణి కారులోనే సజీవ దహనమైంది. కారులో హీటర్‌ను వేయడం వల్లే మంటలు అంటుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఉదయ్ హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపాడు. ప్రమాదంపై మన్నాఎక్కెల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.