ఇంటి నుంచి గెంటేశాడు

Woman Complaint Against Husband In SP Grievance - Sakshi

భర్తపై భార్య ఫిర్యాదు  

విచారించి న్యాయం చేయాలని పోలీస్‌   

 ప్రజాదర్బార్‌లో ఎస్పీని కోరిన డోన్‌ మహిళ

కర్నూలు: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను భర్త ఇంటి నుంచి గెంటేశాడని డోన్‌ పట్టణం చిగురుమానుపేటకు చెందిన సరోజమ్మ ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేశారు. వదిలించుకోవాలనే ఉద్దేశంతో చాలాకాలంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆధారం లేదని, విచారణ జరిపించి న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని  నిర్వహించారు. డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 91211 01200 నంబర్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలను నోట్‌ చేసుకున్నారు. తర్వాత నేరుగా వచ్చి కలసిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 56 ఫిర్యాదులు వచ్చాయి. 

ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
తాను వరి ధాన్యం కమీషన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని, కొత్తపల్లి, నంద్యాలకు చెందిన 63 మంది రైతుల నుంచి 12,500 బస్తాల వరి ధాన్యం కోటేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి అనే దళారులు కొనుగోలు చేసి చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా తిప్పుకుంటున్నారని కొత్తపల్లె గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి ఫిర్యాదు చేశారు. 9 నెలల నుంచి డబ్బులివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, విచారణ జరిపించి ధాన్యం డబ్బులు ఇప్పించి న్యాయం చేయాల్సిందిగా ఆయన కోరారు. 

తన నలుగురు కుమార్తెలకు పెళ్లి చేయడానికి ఇంటిని అమ్మకానికి పెడుతుంటే ఇంటి పక్కనున్న వ్యక్తి  అడ్డు పడుతున్నాడని కల్లూరు మండలం షరీఫ్‌నగర్‌కు చెందిన జగదీష్‌ ఫిర్యాదు చేశారు. అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఇంటి అమ్మకాన్ని అడ్డుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

నిర్మల గ్యాస్‌ ఏజెన్సీ వారు రూ.2 లక్షలకు చెక్కు ఇచ్చారని, బ్యాంకుకు వెళ్తే అది చెల్లడం లేదని ఖండేరి వీధికి చెందిన శ్యామలమ్మ ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా ఆమె కోరారు.  

వృద్ధాప్యంలో ఉన్న తమ పోషణ గురించి కుమారుడు పట్టించుకోవడం లేదని కర్నూలు శ్రీకృష్ణ కాలనీకి  చెందిన వృద్ధ దంపతులు వినాయకరావు, పద్మావతి ఫిర్యాదు చేశారు. కుమారుడు టైలరింగ్‌ పనిచేస్తున్నప్పటికీ ఇంటి ఖర్చులకు ఎలాంటి డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వృద్ధురాలైన తన భార్య పద్మావతి మూర్చ వ్యాధితో బాధ పడుతోందని, చిన్నచిన్న విషయాలకు ఇంట్లో గొడవ పడి కూతురితో పాటు తనను కుమారుడు కొట్టి గాయపరుస్తున్నాడని వినాయకరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.  

బేతంచర్ల మండలం ముద్దవరం, సి.బెళగల్‌ మండలం బురాన్‌దొడ్డి గ్రామాల పరిధిలో కొంతమంది వ్యక్తులు నాటుసారా వ్యాపారం జోరుగా సాగిస్తున్నారని, విచారణ జరిపించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు.  

డయల్‌ యువర్‌ ఎస్పీ ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ గోపీనాథ్‌ జట్టి హామీ ఇచ్చారు. అడిషనల్‌ ఎస్పీ షేక్‌షావలి, ఓఎస్‌డీ రవిప్రకాష్, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు పవన్‌కిషోర్, దివాకర్‌రెడ్డి తదితరులు ప్రజాదర్బార్‌లో పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top