పై అధికారి లైంగిక వేధింపులు

Velugu Employee Complaint On Office Harassments West Godavari - Sakshi

వెలుగు కార్యాలయం ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు

పట్టించుకోని పోలీస్‌ అధికారులు

పశ్చిమగోదావరి, కుక్కునూరు: పై అధికారి లైంగికంగా వేధించాడని కుక్కునూరు మండలం వెలుగు కార్యాలయం ఉద్యోగిని పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఆమె ఎస్పీకి కూడా వాట్సాప్‌లో ఫిర్యాదు పంపినట్టు సమాచారం. వివరాలు ఆలస్యంగా బయటపడ్డాయి.   జంగారెడ్డిగూడెం వెలుగు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి తనను లైంగికంగా వేధించాడని వెలుగు కార్యాలయంలో పనిచేస్తున్న మండల స్థాయి ఉద్యోగిని కుక్కునూరు పోలీస్‌ స్టేషన్‌లో గత నెల 31న ఫిర్యాదు చేసింది.

వేధింపులు తాళలేక గతంలో ఆత్మహత్యాయత్నం
ఇదే  మహిళా ఉద్యోగి గతంలో కామవరపు కోటలో విధులు నిర్వహిస్తుండగా ఈ అధికారే అడిట్‌ కోసమని వచ్చి ఈ ఉద్యోగినిపైనే లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న అప్పటి డీఆర్‌డీఏ పీఓ ఈ విషయంలో రాజీ చేసినట్టు తెలిసింది.

కోరుకొన్న చోటుకు బదిలీ కాకుండా ఆపి..
ఈ మహిళా ఉద్యోగినిపై కన్నేసిన పై అధికారి చేష్టలు భరించలేక దేవరపల్లికి బదిలీ చేయాలని పీడీని కోరినా.. పీడీతో ఆ పై అధికారికి ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఆమెను కోరుకున్న చోటుకు కాకుండా ఆ అధికారి పనిచేస్తున్న సర్కిల్‌కు బదిలీ చేయటంతో ఇంకా వేధింపులు అధికం అయినట్టు తెలుస్తోంది.

సాయంత్రం 6 గంటల తరువాత వచ్చి కలవమని..
ఉద్యోగినికి కుక్కునూరు బదిలీ కావడంతో ఆ జాయినింగ్‌ లెటర్‌ తీసుకొచ్చి ఐటీడీఏ పీఓకు ఇచ్చింది. అయితే తనకు జాయినింగ్‌ లెటర్‌ ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడమేంటంటూ సదరు పై అధికారి ఉద్యోగిని సహోద్యోగులకు ఆమెను సాయంత్రం 6 గంటల తరువాత వచ్చి కలవాలని చెప్పమని ఫోన్‌ చేసినట్టు తెలిసింది.

అన్నీ తెలిసినా సహకరించని సహోద్యోగులు
ఈ విషయాలన్నీ తెలిసి కూడా తోటి ఉద్యోగులు ఆమెకు అండగా నిలిచేందుకు ఆయనకు భయపడి ముందుకు రావడంలేదు. ఇదే డిపార్ట్‌మెంట్‌లో ఓ మహిళను కూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేడయంతో సదరు మహిళ ఐటీడీఏ లో పంచాయతీ పెటించినట్టు సమాచారం. దాంతో దిగివచ్చిన ఆ అధికారి తప్పు అయిందంటూ ఆమె కాళ్లు పట్టుకొని రాజీ చేసుకున్నట్టు  ఆరోపణలు ఉన్నాయి. ఇతని ధాటికి ఇద్దరు మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయమై గతంలో డిపార్ట్‌మెంట్‌ విచారణ
ఇప్పటికే ఈ విషయమై అంతర్గత విచారణ జరిగినా ఆ విచారణ బృందంలో సభ్యులు కూడా సదరు అధికారి వైపు మాట్లాడటమే కాక బృందంలోని మహిళా అధికారి బాధిత ఉద్యోగినితో కొండకు అడ్డుపోకు అంటూ బెదిరించినట్టు సమాచారం.

పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం
గత నెల 31న కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైకి ఫిర్యాదు చేయడంతోపాటు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని.ఇంతవరకు ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. దీంతో ఆ ఉద్యోగిని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top