పోలీసుల అదుపులో ఇద్దరు న్యూడెమోక్రసీ నేతలు!

Two New Democracy Leaders in police custody - Sakshi

సూర్యం, శ్యాంలను అరెస్టు చేసినట్లు ప్రచారం 

అరెస్టా.. లొంగుబాటా?.. 

ధ్రువీకరించని పోలీసులు 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీకి చెందిన ఇద్దరు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కమిటీ సభ్యుడు, మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి సోమ భాస్కర్‌ అలియాస్‌ సూర్యం, జిల్లా కమిటీ సభ్యుడు బూర్క ప్రతాప్‌ అలియాస్‌ శ్యాంలను సోమవారం అర్ధరాత్రి వరంగల్‌ రూరల్‌ జిల్లా అసరవెల్లి, మేడిపల్లి గ్రామాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది. సూర్యం దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన వ్యక్తి కాగా, శ్యాం కొత్తగూడ మండలం గంజేడు వాసి.

సూర్యం సుమారు రెండు దశాబ్దాలుగా వామపక్ష ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల న్యూడెమోక్రసీ పార్టీలో, పార్టీ నాయకులకు దళాల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇద్దరు కీలక నేతలు పోలీసుల అదుపులోకి చేరడం చర్చనీయాంశంగా మారింది. సూర్యం, శ్యాంలను అసరవెల్లి, మేడిపల్లి సరిహద్దులో ఓ ఇంట్లో సేద తీరుతుండగా పోలీసులు అరెస్టు చేశారని ఆ పార్టీ నాయకులు చెబుతుండగా.. వారిద్దరు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారన్న ప్రచారం ఉంది. అయితే ఈ విషయమై పోలీసులు మాత్రం మంగళవారం సాయంత్రం వరకు ్ర«ధుృవీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలు పోలీసులకు చిక్కారా..? లేక లొంగిపోయారా..? అన్న చర్చ జరుగుతోంది.  

సూర్యం, శ్యాంను కోర్టులో హాజరుపర్చాలి  
సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సూర్యం, శ్యాంలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపర్చాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వీరిద్దరిని రహస్యంగా ఉంచటం అనేక అనుమానాలు కలిగిస్తుందని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top