
‘సృష్టి’వ్యవహారాలపైకొనసాగుతున్న దర్యాప్తు
పాత కేసులను వెలికి తీస్తున్న పోలీసులు
ఐదు రోజుల పోలీసు కస్టడీకి డాక్టర్ నమ్రత
సాక్షి, హైదరాబాద్: సరోగసీ పేరుతో చిన్నారుల అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను తదుపరి విచారణ నిమిత్తం ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ సికింద్రాబాద్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు నందిని, సంజయ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇంకోవైపు నమ్రత నేర చరిత్రను పోలీసులు తిరగదోడుతున్నారు. గతంలో నమోదైన కేసుల పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. నమ్రతపై నగరంలోని గోపాలపురం ఠాణాలో 5, విశాఖపట్నంలో 5, గుంటూరులో ఒక కేసు ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు.
శిశువు చనిపోయిందని నమ్మించి..
విజయనగరానికి చెందిన దంపతులు సంతాన లేమితో బాధపడుతూ 2019 ఫిబ్రవరిలో విశాఖ సెంటర్‌లో డాక్టర్ నమ్రతను కలిశారు. వారికి సరోగసీ సిఫార్సు చేసిన ఆమె రూ.13 లక్షలు వసూలు చేసింది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పి.భీమవరానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మి 2020 జనవరిలో చోడవరం పెద్దబజారులోని ఓ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్ నమ్రతకు ఏజెంట్‌గా వ్యవహరించిన నేమాల నూకరత్నం ఉచితంగా డెలివరీ చేయిస్తానంటూ ఆమెను నమ్మించింది.
2020 జనవరి 30న ఆమెను విశాఖలోని పద్మజ ఆస్పత్రిలో చేర్పించింది. ఈమెకు ఆ మర్నాడే ఆడపిల్ల పుట్టింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోయిందని వెంకటలక్ష్మిని నమ్మించిన నూకరత్నం నమ్మించడంతో నమ్రత ఫిబ్రవరి 6న ఆ శిశువును విజయనగరం దంపతులకు అప్పగించింది. అయితే అప్పటికే సృష్టి సెంటర్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విజయనగరం జంట పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది.
ఉచిత డెలివరీ, డబ్బు ఆశ చూపించి..
ఇంకో కేసులో విశాఖ సమీపంలోని కానికారమాత కాలనీకి చెందిన సుందరమ్మ గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్తలు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ విషయాన్ని నమ్రత ఏజెంట్‌గా ఉన్న ఆర్జి రామకృష్ణకు తెలిపారు. ముగ్గురూ కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, శిశువును ఇచ్చేస్తే కొంత డబ్బు ఇస్తామని ప్రలోభానికి గురిచేశారు. విశాఖలోని సృష్టి సెంటర్లో సుందరమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. నమ్రత ఆ చిన్నారిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులకు అమ్మేసింది.
సుందరమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు అంగన్‌వాడీ టీచర్ సరోజిని ఆమెకు పోషకాహారం అందించేది. సుందరమ్మ డెలివరీ విషయం తెలుసుకుని ఆమె ఆరా తీయడం, సుందరమ్మ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో 2020 మార్చి 14న చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో శిశు విక్రయం బయటపడగా, అదే నెల 20న ఆ పసికందును వెనక్కి తీసుకువచ్చారు. కర్ణాటకకు పారిపోయిన నమ్రతను జూలైలో పోలీసులు దావణగిరిలో అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

విజయవాడలో సృష్టి సెంటర్ ఆక్రమాలపై 2015లో కృష్ణా జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 2018లో ఈ లైసెన్సు రద్దు అయింది. ఇలావుండగా డాక్టర్ నమ్రత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారని, అందులోనూ కొందరిని మోసం చేశారని పోలీసులు చెప్తున్నారు.
నమ్రత నేరం అంగీకరించారు: పోలీసులు
సృష్టి సెంటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని గోపాలపురం పోలీసులు సికింద్రాబాద్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సరోగసీ చేయకపోయినా ఆ పేరుతో దంపతులను నమ్మించానని వెల్లడించినట్లు తెలిపారు. ఆమెను కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ వివరాలను పొందుపరిచారు. సృష్టి సెంటర్ చేసిన నేరాలు, వాటి మూలాలు, సహ నిందితులను గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. కాగా నమ్రతను పోలీసులు శుక్రవారం జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు.