
రేప్ కేసులో అరెస్టు చేసి తరలిస్తుండగా ఘటన
పోలీసుల పైకి రాళ్లు రువ్వి, కాల్పులకు దిగిన అనుచరులు
పటియాలా: పంజాబ్‌లోని అధికార ఆప్‌కు చెందిన ఎమ్మెల్యే నాటకీయ పరిణామాల నడుమ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడం సంచలనంగా మారింది. అత్యాచారం కేసు కావడంతో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి ఆయన అనుచరులు తుపాకులతో కాల్పులు జరుపుతూ, రాళ్లు రువ్వారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నారు. హరియాణాలోని కర్నాల్ జిల్లా దబ్రి గ్రామంలోని నివాసంలో ఉన్న హర్మీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు మంగళవారం పటియాలా పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్యేను తరలిస్తుండగా కొందరు గ్రామస్తులు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతోపాటు కాల్పులకు దిగారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే తప్పించుకున్నారు. ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. స్కార్పియో వాహనంలో ఎమ్మెల్యే తప్పించుకునే క్రమంలో ఓ పోలీసుపైకి వాహనాన్ని డ్రైవ్ చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరుడు బల్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని మూడు తుపాకులు, ఫార్చునర్ కారును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారయ్యేందుకు ఎమ్మెల్యే వాడిన వాహనాన్ని అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.
భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు నమ్మించి, తనతో హర్‌ప్రీత్ సింగ్ సంబంధం కొనసాగించాడని జిరాక్ పూర్‌కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. అనంతరం 2021లో పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రైవేట్ చిత్రాలు చూపుతూ బెదిరిస్తున్నట్లు ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై రేప్, మోసం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఇటీవల పలు ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కల్పించిన వ్యక్తిగత భద్రతను సైతం ఉపసంహరించుకుంది.