ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య | Traffic Constable Commits Suicide in SPSR Nellore | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Feb 18 2020 1:15 PM | Updated on Feb 18 2020 1:15 PM

Traffic Constable Commits Suicide in SPSR Nellore - Sakshi

మోహన్‌బాబు (ఫైల్‌)

నెల్లూరు(క్రైమ్‌): ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షిర్డీసాయి నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన మోహన్‌బాబు (36)కి రాజంపేటకు చెందిన తన సమీప బంధువు కుమార్తె సరితతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి శశాంక్‌ (5) అనే కుమారుడున్నాడు. ప్రస్తుతం మోహన్‌బాబు నార్త్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా సరిత ఓ బ్యాంక్‌లో అధికారాణిగా పనిచేస్తోంది. కొంతకాలంగా దంపతుల నడుమ విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మోహన్‌బాబు కుమారుడిని స్కూల్‌కు పంపేందుకు రెడీ చేయగా సునీత వ్యాన్‌ ఎక్కించేందుకు తీసుకెళ్లింది.

తర్వాత ఏమి జరిగిందో గానీ మోహన్‌బాబు తన పడకగదిలోకి వెళ్లి తలుపుగడియ పెట్టుకున్నాడు. భార్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన సునీత భర్త పడకగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడని గుర్తించి స్థానికులను పిలిచింది. వారి సహకారంతో తలుపులు పగులగొట్టి చూడగా మోహన్‌బాబు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని నిర్ధారించారు. మోహన్‌బాబు మృతిపై బాధితురాలు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ కె.వేమారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement