పరీక్ష రాసేందుకు వెళుతూ..

Tenth Students Injured In Auto Accident - Sakshi

ప్రమాద బారిన పడిన పదో తరగతి విద్యార్థులు

గండేపల్లి శివారున ఘటన

వాహనాన్ని తప్పించబోయి.. అదుపుతప్పి బోల్తాపడిన ఆటో

విద్యార్థులకు తీవ్ర గాయాలు

గండేపల్లి(జగ్గంపేట): పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళుతున్న ఆటోలో వెళుతున్న విద్యార్థులు ప్రమాదబారిన పడ్డారు. రాంగ్‌రూట్లో వస్తున్న వాహనాన్ని తప్పించబోయే ప్రయత్నంలో ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టడంతో ఆటోలో ఉన్న విద్యార్థులు తీవ్రగాయాలపాలయ్యారు. ఎస్సై దుర్గాశ్రీనివాస్‌ కథనం ప్రకారం.. సోమవారం మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన మల్లేపల్లి హైస్కూల్‌ విద్యార్థులు 12 మంది గండేపల్లిలో హైస్కూల్‌ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆటోలో వెళుతున్నారు. గండేపల్లి శివారున రాయి చెరువు ఎదురుగా(సోమా కంపెనీ) సమీపంలోకి వచ్చేసరికి గండేపల్లిలో రైస్‌మిల్లుకు చెందిన బొలెరో(మినీ వాహనం) రాంగ్‌రూట్లో వస్తోంది.

దీంతో విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటో బొలెరాను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కె.వీరదుర్గలక్ష్మి, జి.వీరలక్ష్మి, షేక్‌ దేవి, ఎం.దేవిలకు తీవ్రంగా,  మిగిలిన విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇతర ప్రయాణికులు, స్థానికుల సహాయంతో పోలీసులు ఆటోలో చిక్కుకున్న విద్యార్థులను బయటకుతీసి మరో వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ముగ్గురు పరీక్షలు రాయలేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరొకరి సహాయంతో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించారు. పరీక్ష సమయం ముగిసిన వెంటనే నలుగురు విద్యార్థులను రోడ్డు సేఫ్టీ వాహనంలో రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షలకు హాజరైన విద్యార్థులను తహసీల్దార్‌ గీతాంజలి, ఎంపీడీఓ రమేష్, ఎంఈఓ కేహెచ్‌ నాయక్, సీఐ కాశీవిశ్వనాథం, పోలీస్‌ సిబ్బంది పరిశీలించి తల్లిదండ్రులు, బందువులతో మాట్లాడారు. ప్రమాదమేమిలేదని ఆందోళన చెందవద్దని ఓదార్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top