అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

MLA Dasari Manohar Rao Sister Family Funeral Was Completed - Sakshi

సత్యనారాయణరెడ్డి కుటుంబానికి శాంతినిలయంలో అంత్యక్రియలు

చెల్లికి కడసారి వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురు నాయకులు

సాక్షి, కరీంనగర్‌ : కరీంనగర్‌ పరిధిలోని అల్గునూర్‌లో గల కాకతీయ కాలువలో జలసమాధి అయిన కుటుంబానికి సోమవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన చెల్లెలు రాధ మృతదేహంపై పుట్టింటి పట్టుచీరను కప్పి.. తోడబుట్టిన చెల్లెను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడ్డారు. రాధతో పాటు సత్యనారాయణరెడ్డి మృతదేహానికి పట్టుపంచ, కోడలు వినయశ్రీ మృతదేహంపై పట్టుచీర కప్పి చివరిసారి వీడ్కోలు పలుకుతూ విషాదంలో మునిగిపోయారు.

కడసారిగా కన్నీటి వీడ్కోలు..
సత్యనారాయణరెడ్డి కుటుంబంతో బంధం, స్నేహం ఉన్న వారందరూ అలకాపూరికాలనీలోని శాంతినిలయంలో అంత్యక్రియలు జరగడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. పట్టుకొని ఏడ్చేందుకు మృతదేహాలు కుళ్లిపోవడంతో  ఆప్యాయంగా కడసారి కన్నీటి వీడ్కోలు పలుకుదామంటే కూడా అవకాశం లేదని బంధువులు రోదించారు. 

అందరితో అత్మీయంగా...
సత్యానారయణరెడ్డి కుటుంబం అందరితో ఆత్మీయంగా కలుపుగోలుగా ఉండేదని బ్యాంక్‌కాలనీలో ఆయన ఇంటి వద్ద ఉండేవారు తెలిపారు. నవ్వుతూ పలకరించేవాడని ఇరుగుపొరుగు ఉన్న వారు, వారి స్థిరాస్తి వ్యాపారం చేసే స్నేహితులు గుర్తుచేసుకొని బాధపడ్డారు. తన కొడుకు శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందనప్పటి నుంచి మనోవేదనకు గురై రాధ పాఠశాలకు ఎక్కువగా వెళ్లడం లేదని, దాదాపుగా 80 శాతం వరకు మెడికల్‌ లీవ్‌లోనే ఉందని, ఇప్పుడు కూడా జనవరి 7 నుంచి మెడికల్‌ లీవ్‌పెట్టినట్లు మల్కాపూర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ముగ్గురు మృతిచెందారని వార్త తెలియడంతోనే బ్యాంకుకాలనీలో మృతుల ఇంటికి పెద్ద ఎత్తున బంధువులు తరలివచ్చారు. తాళం వేసి ఉండడంతో ఘటనస్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం జరిగే వరకూ ఉండి అలకాపూరి శ్మశానంలో అంత్యక్రియలకు హాజరయ్యారు. 

ఆత్మహత్యేనని అనుమానం..?
జనవరి 25 తేదీన సుల్తానాబాద్‌కు చెందిన వస్త్రవ్యాపారి శ్రీనివాస్‌గౌడ్‌– స్వరూప దంపతులు ఆసుపత్రి కని వచ్చి తిరిగి సుల్తానాబాద్‌ వెళ్లే క్రమంలో కాకతీయ కాలువ వద్ద చేపలు కొనుగోలు చేసి తిరిగివెళ్లే క్రమంలో కాలువలో పడి మృతి చెందారు. అది జరిగినా రెండో రోజే సత్యనారాయణరెడ్డి కారు కాకతీయ కాలువలో పడటంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు చర్చించుకున్నారు. ఇది ఇలా ఉండగా సత్యనారాయణరెడ్డి బంధువులు కొందరు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు వారికి లేవని, అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదమేనని పేర్కొంటున్నారు.


బ్యాంకుకాలనీలో సత్యనారాయణరెడ్డి ఇల్లు

సీసీ కెమెరాలు పరిశీలిస్తే..
జనవరి 27న మధ్యాహ్నం ఆయన దుకాణంలో పనిచేసే నర్సింగ్‌ అనే వ్యక్తిని పిలిపించుకొని కారులో బట్టలు, రైస్‌ కుక్కర్, సిలిండర్, బెడ్‌షీట్లతో పాటు పలు వస్తువులు పెట్టించుకున్నాడు. తర్వాత 3.15 నిమిషాలకు సత్యానారయణరెడ్డి భార్య రాధ ఫోన్‌లో నుంచి నర్సింగ్‌కు ఫోన్‌ చేసి తన ఫోన్‌లో బ్యాలెన్స్‌ అయిపోయిందని రూ.599 ప్యాకేజ్‌ వెయించాలని చెప్పాడు. అదే నర్సింగ్‌తో మాట్లాడిన చివరికాల్‌ కాగా, దాదాపుగా 4 నుంచి 5గంటల సమయంలో కరీంనగర్‌ నుంచి బయలు దేరినట్లు తెలుస్తోంది. 27 తేదీన సీసీ కెమెరాలు కరీంనగర్‌ నుంచి కాకతీయ కాలువ వరకు పోలీసులు పరిశీలిస్తే అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగి ఉంటుందనే విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. 

పలువురి పరామర్శ..
సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంతో వారి బంధువులను పలువురు పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాడే మోశారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కొట్టెపెల్లి గంగరాజు, నీర్ల శ్రీనివాస్, ఎస్‌టీ సంఘాల నాయకులు కుతాడి శివరాజ్, కుతాడి శ్రీనివాస్, ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు మాతంగి రమేష్, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు సముద్రాల శ్రీను, దండు అంజయ్య, మధు, మాట్లా శ్యాం తదితరులు పాల్గొన్నారు. 

24 గంటల్లో  ఆరుగురి మరణవార్త..
24 గంటల్లో మూడు ఘటనలకు సంబందించి మొత్తం ఆరుగురు మరణించారన్న వార్త విని కరీంనగర్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 16వ తేదీ ఉదయం కరీంనగర్‌ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన దంపతులు శ్రీనివాస్, స్వరూప అల్గునూర్‌ బ్రిడ్జి వద్ద లారీ ఢీకొట్టడంతో కారు బ్రిజ్జి కిందపడి శ్రీనివాస్‌ మృత్యువాతపడగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ అనుకోకుండా జారీ పడి చనిపోయాడు. అది మరువక ముందే అదే రోజు రాత్రి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తనలు కాకతీయ కాలువలో పడగా ప్రదీప్‌ ప్రమాదం నుంచి బయటపడగా, కీర్తన ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది. వీరి ఆచూకీ  కనుక్కునేందుకు కాలువ నీటి ప్రవాహం తగ్గించడంతో 17 తేదీన ఉదయం సత్యనారయాణరెడ్డి కుటుంబంతో సహా కారులోనే మృతదేహాలు కుళ్లిపోయి బయటపడటం 24 గంటల్లో ఆరుగురు చనిపోయారని వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు చర్చింకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top