పెద్దలు ప్రేమను నిరాకరించారని..

Lovers Suicide In Kalwakurthy - Sakshi

తలకొండపల్లి(కల్వకుర్తి): నిండునూరేళ్లు హాయిగా బతకాల్సిన ఓ ప్రేమజంట పెద్దల మూర్ఖత్వానికి తనువు చాలించింది. తమ ప్రేమను అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వెంకటాపూర్‌కు చెందిన తాండ్ర వెంకటయ్య, పద్మ దంపతుల మూడో కుమారుడు మల్లేష్‌ (19), అదే గ్రామానికి చెందిన భాషమోని నర్సింలు, భీమమ్మ దంపతుల నాలుగో కుమార్తె శిల్ప(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. మల్లేష్‌ ఇంటర్‌ పూర్తి చేసి డిగ్రీ రెండో సంవత్సరం వరకు జడ్చర్లల్లో చదివాడు.

గతేడాది చదువు మానేసి స్వగ్రా మంలోనే వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. శిల్ప వెల్జాల్‌లో 10వ తరగతి వరకు చదివింది. గతేడాది చదువు మానేసి ఇంటి వద్ద ఖాళీగానే ఉండేది. కొంతకాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పెద్దలు మందలించారు. అయినా, వీరిలో మార్పు రాలేదు. దీంతో శిల్ప  తల్లితండ్రులు ఆమెను మాదాయిపల్లిలో ఉంటున్న బంధువుల వద్దకు పంపించారు. కొంతకాలంగా వీరు దూరంగా ఉంటున్నారు. అయితే, బుధవారం మధ్మాహ్నం మాదాయిపల్లిలో మల్లేష్, శిల్ప కలిసి తిరగడం ఇరుకుటుంబాల పెద్దలు గమనించి మందలించారు. బంధువులు శిల్పను వెంకటాపూర్‌కు పంపించారు.

ఇరు కుటుంబాల్లో వీరి తల్లిదండ్రులు మరోమారు గట్టిగా హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన శిల్ప, మల్లేష్‌ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. గురువారం ఉదయం గ్రామ శివారులో ఇద్దరూ విగతజీవులగా పడి ఉన్నారు. ఉదయం పాలు పితికేందుకు పొలాలకు వెళ్తున్న రైతులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. ఎస్‌ఐ సురేష్‌యాదవ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. సంఘటనా స్థలంలో ఒక బీరు బాటిల్, పురుగులమందు డబ్బా, దానిని కొనుగోలు చేసిన చిట్టీ, వాటర్‌బాటిల్, సెల్‌ఫోన్‌ పడి ఉన్నాయి. మృతుడు మల్లేష్‌ సోదరుడు మహేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పదంగా మృతిచెందినట్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగాని పూర్తివివరాలు తెలిసే అవకాశం లేదన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top