కేరళ గోల్డ్‌ స్కామ్‌కు హైదరాబాద్‌కు లింకు?

Kerala Gold Scam: Hyderabad Link In Hawala Transactions - Sakshi

నగరం నుంచే దుబాయ్‌కి హవాలా డబ్బు

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న కేరళ బంగారం స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు కస్టమ్స్‌ విభాగం గుర్తించిందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసులో అత్యంత కీలకమైన నగదు చెల్లింపులు హైదరాబాద్‌ నుంచే జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. రూ. కోట్లాది విలువ చేసే బంగారం కొనేందుకు నిందితులు అడ్డదారుల్లో హవాలా మార్గాల్లో చెల్లిస్తారన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రూ. కోట్లు హైదరాబాద్‌ నుంచి హవాలా రూపంలో దుబాయ్‌కి చెల్లింపులు చేశారన్న సమాచారంపై కస్టమ్స్‌ శాఖ కూడా కూపీ లాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ను అరెస్ట్‌ చేసింది.

కాగా గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడిన వెంటనే శివకంర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. 

ఈ నెల 6వ తేదీన దుబాయ్‌ నుంచి చార్టర్డ్‌ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్‌ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్‌ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో రాష్ట్ర ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్‌ పార్క్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న స్వప్న బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top