గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు | Hidden Funds For Prayers Rangareddy | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు

Oct 31 2018 1:42 PM | Updated on Oct 31 2018 1:42 PM

Hidden Funds For Prayers Rangareddy - Sakshi

తవ్వకాలు జరిగిన ప్రదేశంలో లభించిన పూజా సామగ్రి  చేవెళ్లలోని పురాతన దర్గా, (ఇన్‌సెట్‌లో) దుండగులు తవ్విన ప్రదేశం

సాక్షి, చేవెళ్ల: హైటెక్‌ కాలంలో కూడా ఇంకా ప్రజలు మూఢ నమ్మకాలను వీడడం లేదు. గుప్త నిధులు ఉన్నాయని క్షుద్రపుజలు నిర్వహిస్తున్నారంటే ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేవెళ్ల మండల కేంద్రంలోని తులసీ వాటర్‌ప్లాంట్‌కు సమీపంలో ఉన్న ఓ పురాతన దర్గా వద్ద సోమవారం  అర్ధరాత్రి కొంత మంది దుండగులు క్షుద్రపూజలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా దర్గా వద్ద గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో వాటర్‌ ప్లాంట్‌ వద్ద ఉండే యువకులు దర్గా వైపు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడం గుర్తించారు. అక్కడ ఎవరో వ్యక్తులు ఉన్నట్లు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వస్తున్నట్లు గుర్తించిన దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు.

ఈ హడావుడిలో  దుండగులు అక్కడే వారి బైక్‌ను వదిలి పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించగా దర్గా వద్ద క్షుద్రపూజలకు ఉపయోగించిన నిమ్మకాయలు, కుంకుమ, ఆకులు, ఇతర పూజా సామగ్రి ఉంది. దర్గా మధ్యలో ఒక గుంత, దర్గాకు రెండు వైపుల రెండు గుంతలను తవ్వారు. దుండగులు మద్యం సేవించేందుకు తీసుకువచ్చిన బాటిళ్లు సైతం అక్కడ లభించాయి. తులసీ వాటర్‌ ప్లాంట్‌ వద్ద పనిచేసే యువకులు సమాచారంతో వచ్చిన పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆరు నెలల క్రితం కూడా.. 
ఆరునెలల కిత్రం కూడా దర్గా ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కాలంలో కూడా ప్రజలు ఇలాంటి వాటిని నమ్మడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు. లేనిపోని ఆశలకు పోయి ప్రమాదాల్లో చిక్కుకుంటారని, ప్రజలు ఇలాంటి వాటిని నమ్మవద్దని  పోలీసులు సూచించారు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా మండలమంతా వ్యాపించడంతో మంగళవారం ప్రజలంతా  దర్గా వద్దకు బారులు తీరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement