
ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న పంచలింగాలకు చెందిన రేఖ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) :
‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త రామకృష్ణ, అత్త రజినమ్మ అదనపు కట్నం కోసం నన్ను, నా పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి కొడుతున్నాడు’’అని పంచలింగాలకు చెందిన రేఖ అనే మహిళ పోలీసుల ప్రజాదర్బార్‌లో ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజలు..పలు సమస్యలను ఎస్పీకి విన్నవించారు.
డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9440795567కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రజా దర్బార్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిచట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ గోపీనాథ్‌జట్టి తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ షేక్షావలీ, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, వినోద్‌కుమార్, రామచంద్ర, సీఐలు రామానాయుడు, డీసీబీఆర్ బి.శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
⇔ తమ మూడు బర్రెలను ఎవరో దొంగిలించారని, కేసు నమోదు చేసుకొని వాటి ఆచూకీ తెలపాలని పగిడ్యాల మండలం తూర్పు పాతకోటకు చెందిన శేఖర్‌రెడ్డి, సువర్ణ దంపతులు ఫిర్యాదు చేశారు.
⇔ కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో ఒక వ్యక్తి రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని పేరు చెప్పుకోవడానికి ఇష్టపడనని ఓ వ్యక్తి ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు.
⇔ కర్నూలు నగరంలోని బుధవారపేట ఓమ్నీ హస్పిటల్ సమీపంలో యువకులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు ఉంచి మద్యం సేవించి అటు ఇటుగా వెళ్లే వారికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
⇔ తాము ప్రేమ వివాహం చేసుకున్నామని, అయితే అమ్మాయి తరఫు బంధువుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తామిద్దరికీ ప్రాణ రక్షణ కల్పించాలని కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామానికి చెందిన ప్రేమికులు విజ్ఞప్తి చేశారు.
⇔ గోనెగోండ్లలో పాఠశాల సమీపంలో ఉన్న వైన్‌షాపును తొలగించాలని గ్రామస్తులు కోరారు.