మళ్లీ తుపాకి కలకలం

Gun Caught In alipiri check point - Sakshi

అలిపిరి చెక్‌పాయింట్‌తనిఖీల్లో పిస్టల్‌

కర్ణాటకకు చెందిన వ్యక్తి నుంచి స్వాధీనం

ఏడాది కాలంలో తుపాకులు దొరకడం ఇది ఐదోసారి

కొండపైన, కాలినడకమార్గాల్లో  తనిఖీలు ముమ్మరం

సాక్షి ప్రతినిధి, తిరుపతి : అలిపిరి చెక్‌ పాయింట్‌లో మళ్లీ తుపాకీ కలకలం రేగింది. శుక్రవారం ఉదయం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న టీటీడీ భద్రతా విభాగం పోలీసులకు పిస్టల్‌తో కొండ మీదకు వెళ్తున్న వ్యక్తి కనిపించాడు. ఆయన దగ్గర్నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని కేజీఎఫ్‌ ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి తన బ్యాగ్‌లో పిస్టల్‌ పెట్టుకుని అలిపిరి తనిఖీల్లో పట్టుబడ్డాడు. వెంటనే అతడిని కస్టడీలోకి తీసుకుని సీవీఎస్‌ఓ ఆకే రవికృష్ణ విచారణ జరుపుతున్నారు.

ఏడాదిలో ఇది ఐదోసారి...
ఏడాది కాలంలో తుపాకీలు లభ్యం కావడం ఇది ఐదోసారి. విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ పోలీసులు సూక్ష్మ స్థాయిలో తనిఖీలు జరపడమే కారణం. గతంలో మహారాష్ట్ర, కోల్‌కతా, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచి వచ్చిన కొంత మంది వ్యక్తులు పిస్టల్స్‌తో అలిపిరి పాయింట్‌లో పట్టుబడ్డారు. ఒకట్రెండు సంఘటనల తర్వాత మారణాయుధాలతో కొండ మీదకు వెళ్లే వ్యక్తులపై భద్రతా విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీవీఎస్‌ఓ రవికృష్ణ స్వయంగా తనిఖీల్లో పాల్గొంటున్నారు. దీంతో కిందిస్థాయిలో పనిచేసే పోలీసులూ అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నారు.

నడక మార్గంలో ఆకస్మిక తనిఖీలు...
కొండమీదకు వెళ్లే వాహనాలన్నీ తప్పనిసరిగా అలిపిరి చెక్‌ పాయింట్‌ మీదగానే వెళ్లాలి. అలిపిరి, మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తుల విషయంలో కొన్నాళ్ల కిందటి వరకూ తనిఖీలు పెద్దగా లేవు. దీంతో చాలామంది తెలివిగా నడక మార్గాలను ఎంచుకుంటున్నారు. చెక్‌పాయింట్‌కు కాస్త పక్కనే ఉన్న వీఎస్‌టీ పాయింట్‌ నుంచి నడక మార్గంలో కొండనెక్కి వినాయక స్వామి గుడి దగ్గర వాహనాలను పట్టుకుని కొండను చేరుకుంటున్నారు. ఇంకొంతమంది కొత్తకొత్త మార్గాల్లో కొండకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరివల్ల తిరుమల క్షేత్రం దగ్గరకు అడపాదడపా లిక్కర్‌ బాటిళ్లు, గంజాయి, మాంసం, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు చేరుతున్నాయి.

దీన్ని అరికట్టేందుకు సీవీఎస్‌ఓ రవికృష్ణ నిత్యం నాలుగు ప్రత్యేక బృందాలను నడక మార్గాలకు కేటాయిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీరి తనిఖీలు ముమ్మరమయ్యాయి. మద్యం బాటిళ్లు, గంజాయి, ఇతరత్రా నిషేధిత వస్తువులను ఇటీవల పెద్ద ఎత్తున పట్టుకున్నారు. దీనికితోడు కొండ పైన కూడా విజిలెన్సు, భద్రతా పోలీసుల తనిఖీలు విస్తృతమయ్యాయి. భవన నిర్మాణ పనివారలుగా షెడ్లల్లో నివాసముండే కూలీలను నిత్యం తనిఖీ చేస్తున్నారు. మేస్త్రీలు, కాంట్రాక్టర్లతో మాట్లాడి కూలీల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top