మళ్లీ రెచ్చిపోయిన మృగాళ్లు

Gang Molestation And Murder on Women in Prakasam - Sakshi

మహిళపై సామూహికఅత్యాచారం?

అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళలను రిమ్స్‌కు తరలించిన 108 సిబ్బంది

చికిత్స పొందుతూ కన్నుమూత

ఒంగోలులోని శ్రీనగర్‌ కాలనీ వాసిగా గుర్తించిన పోలీసులు

నోట్లో బియ్యం కుక్కి చంపి ఉంటారని అంచనా

దర్యాప్తు చేస్తున్న ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌

ఒంగోలు:మహిళపై సామూహిక అత్యాచారం చేయగా బాధితురాలు మృతి చెందిన సంఘటన ఒంగోలు నగర పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరగ్గా బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానిక చిన మల్లేశ్వర కాలనీకి దక్షిణం వైపున ఒక సన్నటి మార్గం ఉంది. ద్విచక్రవాహనాలు, ఆటోలు ఆ మార్గం ద్వారా పాత గుంటూరు రోడ్డులోని ఏ1 ఫంక్షన్‌హాలు వరకు వస్తుంటాయి. ఆ మార్గంలో చిల్లచెట్ల వద్ద ఓ మహిళ ఒంటిపై దుస్తులు ఊడిపోయి అపస్మారక స్థితిలో ఉండగా.. ఉదయాన్నే ఆ వైపుగా  వెళ్లిన పందులు కాసుకునేవారు చూసి సమీప  కాలనీ వాసులకు చెప్పారు. దీంతో వారు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది ఒంగోలు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించగా ఆమె నోట్లో బియ్యం కనిపించాయి. నోట్లో బియ్యం కుక్కి చంపేందుకు యత్నించారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆమె ఒక చేతిపై జి.రాము అని పచ్చబొట్టు ఉంది. కాగా రెండో చేతిపై పచ్చబొట్టు చెరిపేసేందుకు బలవంతంగా యత్నించిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఆమె కాళ్లకు మెట్టెలు, పట్టీలున్నాయి. శరీరంమీద చీర ఉండగా.. ఘటనా స్థలంలో ఆమెకు సంబంధించిన ఒక బ్రా, జాకెట్, ఒక లెగ్గిన్‌ ఉన్నాయి. వీటితోపాటు ఆమె మెడలో ఉండే నల్లపూసల తాడు కూడా గుర్తించారు. దీంతో పోలీసులు ఆమె ఫొటోతో నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి  ఆచూకీని కనుగొన్నారు.

హత్యాయత్నం జరిగిన సంఘటనా స్థలం వద్ద పడి లోదుస్తులు, చెప్పులు, వాడిన కండోమ్స్‌
శివారు ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం
మహిళ ఫొటో మీడియాలో, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఈ క్రమంలో కొంతమంది ఆమెను కర్నూల్‌రోడ్డులో చూసినట్లు చెప్పడంతో కర్నూల్‌ రోడ్డుకు చుట్టు పక్కల ఉన్న కాలనీల్లో సిబ్బందిని పంపి గాలింపు చర్యలు చేపట్టారు.  స్థానిక శ్రీనగర్‌ కాలనీలో మృతురాలి సోదరి, తల్లి నివాసం ఉంటున్నట్లు గుర్తించి విచారించారు. మృతురాలి తల్లి బుట్టి లింగమ్మ వద్దనుంచి సేకరించిన సమాచారం ప్రకారం మృతురాలు ఆమెకు పెద్ద కుమార్తె అయిన ఆలూరి పోలమ్మ (30)గా కనుగొన్నారు. పోలమ్మ భర్త జయరావు, ఆటో డ్రైవర్‌. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 11 సంవత్సరాలు. రాత్రి 9 గంటల సమయంలో పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పోలమ్మ తలుపు బయట తాళం వేసి వెళ్లిపోయింది. ఆ తరువాత ఆమె జాడ లేకపోవడంతో పెద్ద కుమార్తె తెల్లవారుజామున తలుపులు బద్దలు కొట్టి అమ్మమ్మ వద్దకు పరిగెత్తింది. దీంతో కుమార్తె మనుమరాళ్లను ఇద్దరిని తన ఇంట్లోనే ఉంచింది. 

ఎందుకు వెళ్లిందనే దానిపైదర్యాప్తు చేస్తున్న పోలీసులు
అర్ధరాత్రి సమయంలో స్థానిక బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ వరకు మృతురాలి సెల్‌కు సిగ్నల్‌ కనిపించింది. ఆ తరువాత నుంచి స్విచాఫ్‌ అయింది. దీంతో ఆమె సెల్‌కు ఎవరెవరి నుంచి కాల్స్‌ వచ్చాయనే దానిపై సంబంధిత సిమ్‌కార్డు కంపెనీ నుంచి సమాచారం సేకరించే పనిలో పోలీసుశాఖ నిమగ్నమైంది. ఆమెను ఎవరైనా బలవంతంగా హెచ్చరిస్తే బయటకు వెళ్ళిందా, లేక ఆమే బయటకు వెళ్ళిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాల ఆధారంగా ఆమెపై అయిదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది.అయితే అక్కడ నుంచి లభించిన కండోమ్‌లు ఈ ఘటనకు సంబంధించినవేనా లేక గతంలో అటు వైపు వచ్చిన వ్యభిచార ముఠాకు సంబంధించినవా అన్నది తేలాల్సి ఉంది. శివారు ప్రాంతాలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించి అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఘటనా స్థలంలో ఒక్క బియ్యం గింజ కూడా లభించలేదన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top