వీడితో పెట్టుకుంటే.. కొంపలంటిస్తాడు..

fired to homes Accused arrest - Sakshi

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు  

రూ.26.70 లక్షల విలువైన ఆస్తి నష్టం

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: ఇళ్లకు నిప్పుపెడుతూ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నిందితుడు ఎట్టుకేలకు ప్రకాష్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది నవంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ సుమారు 12 తాటాకిళ్లకు నిప్పు పెట్టినట్టు  మంగళవారం ప్రకాష్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాష్‌నగర్‌ సీఐ సూర్యభాస్కరరావు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. విశాఖ రూరల్‌ ప్రాంతానికి చెందిన ప్రగడ రామకృష్ణ అలియాస్‌ సోనిబాబు రాజమహేంద్రవరం రూరల్, పిడింగొయ్యి వెంకటగిరి ప్రాంతంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. పదో తరగతి వరకు చదివిన రామకృష్ణ రాజమహేంద్రవరం, నల్లమందు సందులోని ప్లాస్టిక్‌ సామాన్ల కొట్టులో పని చేస్తుంటాడు.

మద్యానికి బానిసైన రామకృష్ణ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున నాలుగు గంటల వరకు మద్యం సేవిస్తూ మోటారు సైకిల్‌పై తిరుగుతుంటాడు. మద్యం మత్తులో ఎవరో ఒకరితో గొడవలు పడి వారిపై ఉన్న కక్షతో సమీపంలో ఉన్న తాటాకిళ్లకు నిప్పుపెట్టేవాడు. గత ఏడాది నవంబర్‌ నెల నుంచి రాజమహేంద్రవరం, బొమ్మూరు, రాజానగరం పరిధిలోని  తాటాకిళ్లను అంటించాడు. ప్రకాష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వీఎల్‌ పురంలోని సిమెంట్‌ తూరలున్న పాక, పక్కనే ఉన్న హోల్‌ సేల్‌ కూరగాయలు పాక తగుల బెట్టినట్టు వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా ఈనెల 12వ తేదీ సోమవారం రాత్రి వీఎల్‌పురం పాతలారీ స్టాండ్‌ సమీపంలో నిందితుడుని అరెస్టు చేశామని ప్రకాష్‌ నగర్‌ సీఐ సూర్య భాస్కరరావు తెలిపారు. నిందితుడి నుంచి ఇళ్లు అంటించేందుకు ఉపయోగించే అగ్గిపెట్టె ఒక సెల్‌ఫోన్, మోటారుసైకిల్, ఒక సిమ్‌ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

సిమ్‌ కార్డు ఆధారంగా అరెస్ట్‌
రామకృష్ణకు వివాహం కాలేదు. తండ్రి, అన్నయ్య జట్టు కూలీలుగా పనిచేస్తున్నారని సీఐ తెలిపారు. నిందితుడు నేర సమయాల్లో సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతుండడం అలవాటు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై పది కేసులు ఉన్నాయని 12 ఇళ్లు దహనం చేశాడని తెలిపారు. రూ.26.70 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top