తనయున్ని చంపిన తండ్రి!

Father Killed To Son In Karimnagar - Sakshi

సాక్షి, సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: తలకొరివి పెట్టాల్సిన కొడుకే..తాగుడుకు బానిసై తండ్రి చేతిలో హతమయ్యాడు. మద్యానికి అలవాటు పడి ఉన్మాదంతో ఊగిపోతూ.. ప్రతిరోజు ఇంట్లో వారిని దూషిస్తూ... దాడులు చేస్తుంటే భరించలేని ఆక్రోషంలో ఓ తండ్రి తనయున్ని చంపిన సంఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఎక్కల్‌దేవి లక్ష్మినర్సు స్క్రీన్‌ ప్రింటింగ్‌ చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య వెంకటమ్మ, ఇద్దరు కొడుకులు రాజు, మహేష్‌(27), కూతురు కవిత ఉన్నారు. రాజు, కవితలకు వివాహాలు చేయగా వారు జీవితంలో స్థిరపడ్డారు.

మహేష్‌ మాత్రం తాగుడుకు బానిసై ప్రతిరోజు ఇంట్లో వారితో గొడవ పడేవారు. పనిలేకుండా తాగడానికి రోజు డబ్బులు కావాలని ఇంట్లో బెదిరిస్తూ.. వస్తువులను పగులగొట్టేవాడు. శనివారం రాత్రి కూడా తాగొచ్చిన మహేష్‌ ఇంకా డబ్బులు కావాలని స్క్రీన్‌ ప్రింటింగ్‌ చేస్తున్న తండ్రిని కోరగా.. లేవన్నందుకు విలువైన గ్లాసులు, ఇతర వస్తువులు పగులగొట్టాడు. ఆవేశం ఆపుకోలేని స్థితిలో లక్ష్మినర్సు మహేష్‌ను నెట్టేసి దగ్గర్లో కనిపించిన రోకలిబండతో మోదాడు. రక్తం మడుగులో పడిఉన్న మహేష్‌ను స్థానికుల సాయంతో రాత్రి సిరిసిల్ల ఏరియాస్పత్రికి తీసుకురాగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అనీల్‌కుమార్‌ తెలిపారు.

కౌన్సిలింగ్‌ చేసినా.. మార్పు లేదు.. 
మహేష్‌ పనిపాట లేకుండా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నాడు. తాగిన మైకంలో ఇంట్లో, బయట వారితో గొడవ పడేవాడని తెలిసింది. ఇదివరకే రెండుమూడు సార్లు పోలీస్టేషన్‌లో మహేష్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చినా..పద్ధతి మారలేదు. శనివారం రాత్రి కూడా తల్లిదండ్రులను దూషిస్తూ..వస్తువులు పగులగొడుతుండగా..ఆక్రోషం పట్టలేక తండ్రి లక్ష్మినర్సు పక్కనే ఉన్న రోకలిబండతో మోదగా మహేష్‌ చనిపోయాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top