నాకేం సంబంధం లేదు : శేఖర్‌ కమ్ముల

Fake director booked for impersonating Sekhar Kammula - Sakshi

నటీనటులు కావలెనంటూ క్వికర్‌లో పోస్ట్‌

రిజిస్ట్రేషన్ల పేరుతో అందినకాడికి దోచేసిన నిందితులు

తన పేరు చెప్పి మోసం చేస్తున్నారని శేఖర్‌ కమ్ముల ఫిర్యాదు  

సాక్షి, హైదరాబాద్‌: ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. వెంటనే సైబర్‌ నేరగాళ్లు దీన్ని క్యాష్‌ చేసుకున్నారు. శేఖర్‌ పేరుతో క్వికర్‌లో నటీనటులు కావాలంటూ ప్రకటన ఇచ్చి అందినకాడికి దండుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

‘నేను రూపొందిస్తున్న కొత్త సినిమాలో నటించడానికి యువతీయువకులు కావాలి’ అంటూ శేఖర్‌ పేరుతో నెల క్రితం క్వికర్‌లో ఓ ప్రకటన వెలువడింది. సాధారణంగానే శేఖర్‌ కమ్ముల రూపొందించే చిత్రాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రకటన నిజమని నమ్మిన రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఆ పోస్ట్‌లో ఉన్న నంబర్‌ను సంప్రదించారు.

ఫోన్లు రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి రూ.4 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించాడు. ముందుగా రూ.2 వేల వరకు తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయాలని, ఆపై ఈ నెల 25న తుది ఇంటర్వ్యూ హైదరాబాద్‌లో ఉంటుందని నమ్మబలికాడు. ఆ రోజు మిగిలిన మొత్తం చెల్లించాలని చెప్పాడు. దీనికి స్పందించిన వేలాది మంది మోసగాడు సూచించిన ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేశారు.  

విషయం వెలుగులోకి వచ్చిందిలా..
సోమవారం(25న) ఒంగోలుకు చెందిన ప్రదీప్‌ నగరానికి వచ్చి శేఖర్‌ కమ్ములను కలిశారు. మొదట డిపాజిట్‌ చేసింది పోగా మిగిలిన మొత్తం చెల్లిస్తానని, తనను ఇంటర్వ్యూ చేయాలని ఆయన్ను కోరారు. దీంతో అవాక్కైన శేఖర్‌ ఆరా తీయగా ప్రదీప్‌ అసలు విషయం చెప్పారు. అది మోసపూరిత ప్రకటన అని, తనకు సంబంధం లేదని చెప్పిన శేఖర్‌ కమ్ముల సైబర్‌ క్రైమ్స్‌ అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ను కలసి ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top