డయల్‌ 100తో బతికిపోయింది. కానీ..

Ex Husband Tries To Kill Woman At Rajendra Nagar In Hyderabad - Sakshi

మాజీ భార్యపై దాడికి భర్త యత్నం

పోలీసుల సాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డ మహిళ

స్టేషన్‌నుంచి తప్పించుకున్న నిందితుడు

ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ట్విస్టుకు తెర

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ భార్యను హతమార్చాలని పక్కాప్లాన్‌ ప్రకారం ఆమెను వెంబడించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్టేషన్‌నుంచి సదరు నిందితుడు పోలీసుల కళ్లుగప్పి కత్తితో సహా ఉడాయించడంతో ఈ కేసులో ట్విస్టు మొదలైంది. వివరాలు..బోరబండకు చెందిన లావణ్య, సాయి కిరణ్‌కు గతంలో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. అయితే, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. పిల్లలతో కలిసి లావణ్య బండ్లగూడలో నివాసముంటున్నారు. స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. భార్య విడాకులు తీసుకొని వేరుగా ఉండటాన్ని సాయికిరణ్ అవమానంగా భావించాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం పన్నాడు. ఈక్రమంలో శనివారం ఉదయం బండ్లగూడలో సాయిలావణ్యపై కత్తితో దాడిచేసి హతమార్చాలనుకున్నాడు.

అయితే, అనుమానాస్పదంగా సంచరిస్తున్న కిరణ్‌ను గమనించిన లావణ్య.. తన మాజీ భర్తతో ముప్పు ఉందని డయల్ 100కు పోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సత్వరం స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి ఓ కత్తిని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు నిందితుడిని స్టేషన్ బయటే కూర్చోబెట్టడంతో అతను పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతను ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని పోలీసులు ఆందోళనకు గురయ్యారు. తప్పించుకున్న సాయికిరణ్‌ను ఎట్టకేలకు పోలీసులు జూబ్లిహిల్స్‌ వద్ద పట్టుకుని మళ్లీ స్టేషన్‌కు తరలించారు. మాజీ భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని, తమకు తమ కుటుంబానికి రక్షణ కావాలని లావణ్య కోరుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top