బుఖారీ హత్య కేసు.. విస్తు గొలిపే విషయాలు | Escaped Terrorist Killed Shujaat Bukhari | Sakshi
Sakshi News home page

Jun 29 2018 8:42 AM | Updated on Jun 29 2018 8:46 AM

Escaped Terrorist Killed Shujaat Bukhari  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ సయ్యద్‌ షుజాత్‌ బుఖారీ(52) హత్య కేసు దర్యాప్తులో విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాక్‌ నుంచే హత్యకు  ప్రణాళిక రచించారని తేల్చిన కశ్మీర్‌ పోలీసులు.. వ్యతిరేక ప్రచారమే బుఖారీ హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఇక నిందితుల్లో ఒకడు గతంలో శ్రీనగర్‌ జైలు నుంచి పారిపోయిన ఉగ్రవాది అని తేల్చారు. ఈ మేరకు పూర్తి వివరాలను ఐజీ స్వయం ప్రకాశ్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. 

లష్కరే తోయిబా ఉగ్రవాది అయిన నవీద్‌ను గతంలో బలగాలు చాకచక్యంగా బంధించాయి. ఈ ఫిబ్రవరిలో శ్రీనగర్‌ ఆస్పత్రి నుంచి నాటకీయ పరిణామాల మధ్య అతను తప్పించుకుని పారిపోయాడు. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారితోపాటు కొందరు సిబ్బందిపై కూడా వేటు పడింది. అయితే తప్పించుకున్న నాలుగు నెలల తర్వాత నవీన్‌ బుఖారీ హత్యలో భాగస్వామి కావటం గమనార్హం. లష్కరే తోయిబాలో కీలకంగా వ్యవహరించిన సభ్యులే బుఖారీని హత్య చేశారని స్వయం ప్రకాశ్‌ వెల్లడించారు. లష్కరే తోయిబాకే చెందిన నవీద్‌ జాట్, ముజఫర్‌ అహ్మద్, ఆజాద్‌ మాలిక్‌ అనే ఉగ్రవాదులు  ఈ ఘాతూకానికి పాల్పడినట్లు వెల్లడించారు.

విద్వేషపూరిత ప్రచారం.. కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పాలనే అంశంపై షుజాత్ బుఖారీ చాలా కాలంగా క్రియాశీలంగా ఉన్నారు. శాంతి, భద్రత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా జరిగే చాలా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక బుఖారీ హత్యకు ముందు సోషల్‌ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున్న వ్యతిరేక ప్రచారం జరిగింది. బహుశా ఈ విద్వేషపూరిత ప్రచారమే ఆయన హత్యకు దారితీసి ఉండొచ్చు అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మార్చిలో పాకిస్తాన్‌కు పారిపోయిన కశ్మీరీ సాజద్‌ గుల్‌ ఈ హత్యకు ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్నారు. లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్న గుల్‌ను గతంలో పోలీసులు రెండుసార్లు అరెస్ట్‌ చేయగా, తప్పించుకుని దొంగ పాస్‌పోర్టుతో గతేడాది పాక్‌కు చేరుకున్నాడు. 

జూన్‌ 14వ తేదీన ఇఫ్తార్‌లో పాల్గొని వెళ్తున్న రైజింగ్‌ కశ్మీర్‌ ఎడిటర్‌ బుఖారీని బైక్‌పై వచ్చిన ముగ్గురు నిందితులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. పోస్ట్‌ మార్టంలో బుఖారీ దేహం నుంచి 17 బుల్లెట్లను వైద్యులు వెలికి తీశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement