ఖైదీలకు క్షమాభిక్ష

Clemency On Lifetime Prisoners In Nellore Jail - Sakshi

ఉగాదికి 17 మంది జీవిత ఖైదీలు విడుదల

అధికార పార్టీ లాబీయింగ్‌తో

ఓంప్రకాష్‌ విడుదలకు కసరత్తు

ఉగాది పర్వదినం జీవిత ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపనుంది. నెల్లూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు సత్ప్రవర్తన పేరుతో క్షమాభిక్ష పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ జీఓ ద్వారా ఉత్తర్వులు ఇచ్చేందుకు మార్గం సుగమం చేశారు. జిల్లా జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 17 మంది స్వేచ్ఛావాయువులు పీల్చనున్నారు. వీరిలో ఒక మహిళా ఖైదీ ఉన్నారు. అధికార పార్టీ నాయకుల, మంత్రుల లాబీయింగ్‌తో మొద్దు శీను హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మల్లెల ఓం ప్రకాష్‌  పేరు ఉండటం గమనార్హం.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కారాగారాల్లో జీవితఖైదు అనుభవిస్తూ సత్ప్రవర్తన కల్గిన ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేసేందుకు ఈ ఏడాది జనవరి 23వ తేదీన మార్గదర్శకాల (జీఓ నంబర్‌ 8)ను ప్రభుత్వం జారీచేసింది. వీటిని అనుసరించి జిల్లా కేంద్రకారాగార సూపరింటెండెంట్‌ ఎంఆర్‌ రవికిరణ్‌ 17 మందితో కూడిన జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. జాబితాను పరిశీలించిన హైలెవల్‌ కమిటీ 17మంది ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. అయితే జాబితా గణతంత్ర దినోత్సవ సమయంలో ఆమోదం పొందినా పలు సాంకేతిక కారణాలతో విడుదల కాలేదు.

అధికారపార్టీ ఒత్తిడితో ఓంప్రకాష్‌ విడుదల
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మొద్దుశీను హత్యకేసులో నిందితుడు మల్లెల ఓంప్రకాష్‌  క్షమాభిక్ష పొందిన ఖైదీల జాబితాలో ఉన్నట్లు సమాచారం. 2008 నవంబర్‌ 9వ తేదీన అనంతపురం జైలులో టీడీపీ నేత పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన జూలకంటి శ్రీనివాసులురెడ్డి అలియాస్‌ మొద్దు శీనును ఓం ప్రకాష్‌ సిమెంట్‌ డంబెల్‌తో కొట్టి హత్యచేసిన విషయం విదితమే. దీంతో జైలు అధికారులు ఆయనను అక్కడ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడ నుంచి వరంగల్‌ జైలుకు తరలించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014మే 18న ఆయన్ను నెల్లూరు జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. అప్పటినుంచి ఓం ప్రకాష్‌ జిల్లా కేంద్రకారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఆయన విడుదలకు రాష్ట్ర మంత్రితో పాటు అధికారపార్టీ నేతలు శతవిధాల ప్రయత్నాలు చేశారు.  ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు ఓంప్రకాష్‌ విడుదలకు మార్గం సుగమమైంది.

విడుదలయ్యే వారి జాబితా ఇదే..  
2016 జనవరి 26వ తేదీన జిల్లా కేంద్రకారాగారంలోని 22 మందిని, కడప నుంచి వచ్చిన ఎనిమిది మందిని మొత్తం 30 మంది ఖైదీలను విడుదల చేశారు. రెండేళ్ల అనంతరం తిరిగి సత్ప్రవర్తన కల్గిన జీవితఖైదీలను విడుదల చేసేందుకు జైళ్లశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 17మంది ఖైదీలు జిల్లా కేంద్రకారాగారం నుంచి విడుదల కానున్నారు. తాజాగా ఉన్నతాధికారులు ఆమోదించిన జాబితాలో 17మందిలో ఒక మహిళాఖైదీ ఉన్నారు. 2013లో విడుదలకు నోచుకోని ఓ జీవితఖైదీ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో కోర్టు విడుదలకు ఆదేశాలు జారీచేసింది. టి.సురేష్, వి.నరసింహ, జి.శ్రీనివాసులు, ఎం.మల్లికార్జున, ఐ.సుబ్బారావు, ఎం.ఓంప్రకాష్, ఆర్‌.సుధాకర్‌రెడ్డి, టి.నారాయణరెడ్డి, పి.విజయశేఖర్‌రాజు, ఎస్‌.శ్రీను అలియాస్‌ శ్రీనివాస్‌ అలియాస్‌ సన్నికాంతి, ఎన్‌.చిన్నబ్బాయి, డి.గొట్టం వీరన్న, డి. చిన్నవీరన్న, షేక్‌ చిన్న మౌలాలి, జి.శ్రీను అలియాస్‌ దొంగ శ్రీను,  ఎం.మంజుల, పి.సుబ్బారావు విడుదలఅయ్యే వారి జాబితాలో ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top