ఉరివేసుకుని బాలుడి ఆత్మహత్య | Boy Commits Suicide In West Godavari | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని బాలుడి ఆత్మహత్య

Jun 4 2018 7:32 AM | Updated on Nov 6 2018 8:16 PM

Boy Commits Suicide In West Godavari - Sakshi

తిరుమలదేవిపేటలో జీడి చెట్టుకు వేలాడుతున్న గణేష్‌ మృతదేహం

పశ్చిమగోదావరి ,టి.నరసాపురం: జీడి చెట్టుకు ఉరి వేసుకుని 16 ఏళ్ల బాలుడు  మృతి చెందిన సంఘటన  మండలంలోని  తిరుమలదేవిపేటలో ఆదివారం జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన వసంతవాడ గణేష్‌ (16) తన తల్లి విజయలక్ష్మి మందలించిందని మనస్తాపానికి గురై శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం గ్రామానికి చెందిన అబ్బదాసరి చిన వెంకటేశర్వరరావు, వసంతవాడ వెంకట దుర్గారావులు జీడిగింజలు ఏరుకోవడానికి వెళ్లారు. వీరికి దోసగట్టుపై జీడిచెట్టు కొమ్మకు తాడుతో గణేష్‌  మృతదేహం వేలాడుతూ కనిపించింది. వారు గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గణేష్‌ జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 8వతరగతి పూర్తి చేశాడు.

తొమ్మిదో తరగతిలో చేరాల్సి ఉంది. గురుకుల పాఠశాలలో 9వ తరగతిలో చేరేందుకు జంగారెడ్డిగూడెం పాఠశాలకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకోమని శనివారం గణేష్‌కు చెప్పి తల్లి విజయలక్ష్మి కూలిపనికి వెళ్లింది. కూలి పని నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి గణేష్‌ జంగారెడ్డిగూడెం వెళ్లకుండా ఇంటివద్దే ఉండటం చూసి తల్లి మందలించింది. దాంతో గణేష్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. స్వతహాగా గణేష్‌ కోపిష్టి కావడంతో  గతంలో కూడా పలుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి కోపం తగ్గాక తిరిగి వచ్చేవాడు. అలాగే తిరిగి వస్తాడని తల్లి ఎదురు చూస్తుండగా గణేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలిసింది. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో ఎస్సై వి.రాంబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement