ఇన్‌స్పెక్టర్‌ చెప్పాడు.. ఎస్సై చేశాడు! 

ACB Officers Arrested SI Sudheer For Taking Bribe At Jubilee Hills - Sakshi

లంచంగా నగదు, మద్యం సీసాలు డిమాండ్‌..

తీసుకుంటూ ఏసీబీకి దొరికిన జూబ్లీహిల్స్‌ ఎస్సై సుధీర్‌

విషయం తెలుసుకొని పరారైన సీఐ బల్వంతయ్య 

బంజారాహిల్స్‌: ఓ చీటింగ్‌ కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడంతో పాటు భవిష్యత్‌లో కేసు రాజీ చేయడానికి జూబ్లీహిల్స్‌ పోలీసులు రూ.లక్ష నగదు, రెండు ‘వ్యాట్‌ 69’మద్యం బాటిళ్ళు లంచంగా డిమాండ్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ బల్వంతయ్య సూచనల మేరకు అంగీకారం కుదిరిన రూ.50 వేల నగదు, మద్యం బాటిళ్ళు తీసుకుంటున్న ఎస్సై పి.సుధీర్‌రెడ్డి గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఇతడి వాంగ్మూలంతో పాటు ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌ ఆధారంగా బల్వంతయ్య పైనా కేసు నమోదు చేశారు. ఇటు సుధీర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న బల్వంతయ్య కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు మీడియాకు వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన అక్షయ్‌ అనే వ్యాపారి జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నం.10లో ‘ఫేజ్‌ 3 లగ్జరీ సెలూన్‌’నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్‌ 27న వంశీకృష్ణ చౌదరి అనే వ్యక్తి తన భార్యను తీసుకుని ఈ సెలూన్‌కు వచ్చారు. అక్కడ రూ. 34,130 విలువైన ట్రీట్‌మెంట్స్‌ చేయించాడు. ఈ బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోవడంతో అక్షయ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో వంశీకృష్ణపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే డిసెంబర్‌ 31నే వంశీకృష్ణకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు.

ఈ స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చినందుకు, అలాగే ఐపీసీ 406 సెక్షన్‌ తీసేసి కేసును లోక్‌ అదాలత్‌కు పంపేలా చేసేందుకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే రూ.50 వేలు, రెండు మద్యం సీసాలను ఇస్తానని అంగీకరించిన వంశీ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో బాధితుడి నుంచి ఎస్సై సుధీర్‌ డబ్బులు, మద్యం బాటిళ్లను తీసుకుంటుండగా మాటేసిన ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా సుధీర్‌రెడ్డి 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై కాగా.. బల్వంతయ్య స్పెషల్‌బ్రాంచ్‌ నుంచి కొన్నాళ్ళ క్రితం జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీపై వచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top