ఘోరం : ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడులో 14 మంది బలి

14 killed,7 injured after transformer exploded in Jaipur's Shahpura

జైపూర్‌ : అప్పటిదాకా పచ్చతోరణాలతో కళకళలాడిన పెళ్లివారి ఇంటి వాకిలి నిమిషాల వ్యవధిలో మరుభూమిగా మారింది. వేడుకలో సరదాగా చిందులేసిన చిన్నాపెద్దా అంతలోనే విగతజీవులుగా మారారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు ధాటికి ఒక్కరూ ఇద్దరు కాదు ఏకంగా 14 మంది అసలువుబాశారు. ఈ ఘోర సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌ రూరల్‌ జిల్లా షాపూరా తాలూకా ఖటులయీ గ్రామంలో మంగళవారం సాయంత్ర చోటుచేసుకుంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఎలా జరిగింది? : పెళ్లికూతురి దగ్గరికి తరలివెళ్లేముందు వరుడి ఇంట్లో వేడుక జరుగుతున్న సమయంలో, ఆ ఇంటి ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ఒక్కసారిగా పేలిపోంది. ఆర్పడానికి వీలులేనంత స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి, సలసలా కాగే చమురు ఎగజిమ్మింది. ట్రాన్స్‌ఫార్మర్‌కు దగ్గరగా నిల్చున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 20 మందిని షాపురా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందేలోపే మరో 9 మంది మృత్యువాతపడ్డారు. మిగిలిన క్షతగాత్రులను జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

బీజేపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం : బీజేపీ పాలిత రాజస్థాన్‌లో కరెంటు కారణంగా ప్రతిరోజూ ఒకరో, ఇద్దరో చనిపోవడం పరిపాటిగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్ల నిర్వహణ దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. 14 మందిని బలిగొన్న ఖలుటయీ గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ సైతం కొద్దిరోజులుగా సరైన నిర్వహణకు నోచుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. విద్యుత్‌ శాఖ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమవారి ప్రాణాలు పోయాయని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. షాపూరా ఆస్పత్రి వద్ద మృతదేహాలతో ఆందోళన నిర్వహించారు.

రూ.10 లక్షల నష్టపరిహారం : ఖటులయీ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడు ఘటనపై రాజస్థాన్‌ సీఎం వసుంధరా రాజే దిగ్భ్రాంతి చెందారు. ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని, ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశారు. ప్రమాదంలో చనిపోయిన 14 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు జైపూర్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ మహాజన్‌ ప్రకటించారు. శాఖాపరమైన విచారణకు ఆదే పెనుప్రమాదం జరిగిన ఖటులయీని బుధవారం పలువులు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు సందర్శించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top