
ఉషా ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్లాంటు విస్తరణ
గృహోపకరణాల తయారీలో ఉన్న ఉషా ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్లాంటును విస్తరించాలని యోచిస్తోంది.
* మరో రూ.20 కోట్ల వ్యయం
* ఉషా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రోహిత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహోపకరణాల తయారీలో ఉన్న ఉషా ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్లాంటును విస్తరించాలని యోచిస్తోంది. ఇందుకు వచ్చే రెండేళ్లలో రూ.20 కోట్ల దాకా వ్యయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గత మూడేళ్లలో ఈ ప్లాంటు విస్తరణకు కంపెనీ రూ.20 కోట్ల దాకా ఖర్చు చేసింది. కోల్‌కతాలోనూ ఉషా ఇంటర్నేషనల్‌కు ప్లాంటు ఉంది.
రెండు ప్లాంట్లలో కంపెనీ ఏటా 25-30 లక్షల ఫ్యాన్లను తయారు చేస్తోంది. జీఎస్‌టీ అమలు, తయారీ విషయంలో ప్రభుత్వ విధానంలో స్పష్టత వస్తే మూడో ప్లాంటు గురించి ఆలోచిస్తామని ఉషా ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, హోమ్ యూపీఎస్ విభాగం ప్రెసిడెంట్ రోహిత్ మాథుర్ శుక్రవారమిక్కడ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉన్న ప్లాంటును పెద్ద ఎత్తున విస్తరించేందుకు వీలుగా ఉందని అన్నారు.
ఏటా 6 కోట్ల యూనిట్లు..: భారత్‌లో ఫ్యాన్ల పరిశ్రమ రూ.7,000 కోట్లకు చేరుకుంది. ఏటా 6 కోట్ల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో వ్యవస్థీకృత రంగ కంపెనీలు 4 కోట్ల ఫ్యాన్లను విక్రయిస్తున్నాయి. ఇక పరిశ్రమ వృద్ధి రేటు 7% కాగా, ఉషా ఇంటర్నేషనల్ 18-20% నమోదు చేస్తోందని రోహిత్ తెలిపారు. ‘అమెరికాకు చెందిన హంటర్ కంపెనీ ఫ్యాన్లను ఉషా హంటర్ బ్రాండ్‌తో విక్రయిస్తున్నాం. ప్రీమియం విభాగంలో సొంతంగా ఫోంటానా బ్రాండ్ ప్రవేశపెట్టాం. పిల్లల గదుల కోసం బార్బీ, చోటా భీమ్, హాట్‌వీల్స్, డోరేమాన్ బొమ్మలతో కూడిన ఫ్యాన్లను ప్రవేశపెట్టాం’ అని వివరించారు. ఉషా ఫ్యాన్ల ధరలు రూ.30 వేల వరకు ఉన్నాయి.