బంగారానికి ‘ట్రంప్‌’ బూస్ట్‌!

Trump Pessimism Over US And China Trade Deal Underpins Gold  - Sakshi

వాణిజ్య యుద్ధం ముగింపు ఇప్పట్లో ఉండదన్న సంకేతాలు  

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లభించే అవకాశాలు లేవన్న సంకేతాలు పసిడికి ఊతం ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర మంగళవారం  భారీగా పెరిగింది. ఈ వార్తరాసే రాత్రి 9గంటల సమయంలో పసిడి ధర 17 డాలర్లు పెరిగి 1,486 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెజిల్, అర్జెంటీనాలపై సోమవారం అమెరికా వాణిజ్య ఆంక్షలు,  చైనాతో 2020 ఎన్నికల వరకూ వాణిజ్య యుద్ధం సమసిపోయే అవకాశాలు లేవని మంగళవారం అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన పసిడికి బలాన్ని ఇచ్చాయి.

హాంకాంగ్‌ ఆందోళనకారులకు మద్దతునిచ్చే హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డెమోక్రసీ యాక్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేయడం,  హాంకాంగ్‌లో ఆందోళనకారులకు మద్దతు కొనసాగిస్తే, దానికి ప్రతిగా తాము కూడా తగిన రీతిలో బదులివ్వాల్సి ఉంటుందని చైనా అమెరికాను హెచ్చరించడం తత్సంబంధ అంశాలు పసిడిపై ఇప్పటికే తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి.   గడిచిన 52 వారాల్లో పసిడి ధర ఔన్స్‌ (31.1గ్రా) ధర  1,248 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఉత్తరకొరియా, ఇరాన్‌ వంటి దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగి నెలన్నర క్రితం 1,566 డాలర్లను తాకింది.

దేశీయంగానూ పటిష్టమే...
భారత్‌ విషయానికి వస్తే, మంగళవారం రాత్రి 9 గంటలకు పసిడి ధర 10 గ్రాములకు దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో రూ.816 లాభంతో రూ.38,768 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా రాత్రి ట్రేడింగ్‌ కొనసాగి, రూపాయి బలపడకుండా ఉంటే పసిడి ధర బుధవారం భారీగా పెరిగే అవకాశం ఉంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top