పోలీసులకు లొంగిపోయిన సుబ్రతారాయ్

పోలీసులకు లొంగిపోయిన సుబ్రతారాయ్ - Sakshi


న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. లక్నో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మార్చి 4 వరకూ రాయ్ ఉత్తరప్రదేశ్ పోలీస్ కస్టడీలోనే కొనసాగనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి రూ.25 వేల కోట్ల సమీకరణ, సుప్రీంకోర్టు రూలింగ్‌కు అనుగుణంగా ఈ మొత్తం పునఃచెల్లింపుల విషయంలో వైఫల్యం, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్లు, వాయిదా వాయిదాకూ అత్యున్నత న్యాయస్థానం చివాట్ల నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.



స్వయంగా ఫిబ్రవరి 26న తన ముందు హాజరుకావాలని 20వ తేదీన సుప్రీం ఆదేశించడం, దీనిని పాటించడంలో రాయ్ వైఫల్యం, దీనితో సుప్రీం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ,  దీనిని రీకాల్ చేయమని 27న రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం శుక్రవారం తోసిపుచ్చడం వంటి అంశాల నేపథ్యంలో రాయ్ అరెస్ట్ తప్పలేదు.



 నాటకీయ పరిణామాల మధ్య...

 రాయ్ అరెస్ట్ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని సంబంధిత వర్గాల సమాచారం. దీనిప్రకారం, సహారా గ్రూప్ చీఫ్ అరెస్ట్‌కు పోలీసులు గురువారం నుంచీ పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన ఆచూకీ తెలియలేదు. అయితే శుక్రవారం ఉదయం ఆయన స్వయంగా పోలీసులను ఇంటికి పిలిచి మరీ లొంగిపోయారు. అరెస్ట్ అయిన తరువాత కూడా ఆరు గంటలకుపైగా రాయ్ తన నివాసంలోనే కొనసాగారు. అటు తర్వాత ఆయనను లగ్జరీ కార్ల శ్రేణితో సీజేఎం కోర్టుకు తరలించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ, కోర్టు ప్రత్యేకంగా ఏర్పాటయ్యింది.



 చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆనంద్ కుమార్ యాదవ్ కోర్టులో రాయ్‌ని పోలీసులు ప్రవేశపెట్టారు. హౌస్ అరెస్ట్ కింద ఉంచడానికి అనుమతించాలన్న రాయ్ విజ్ఞప్తిని మేజిస్ట్రేట్  ఈ సందర్భంగా తోసిపుచ్చారు. పోలీస్ కస్టడీకి ఆదేశించారు.  సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టేంతవరకూ రాయ్‌ని ఎక్కడ ఉంచాలన్నది స్పష్టం కాకపోయినప్పటికీ, ఈ అంశాన్ని పోలీసుల విచక్షణాధికారాలకు వదిలివేసినట్లు ఆయన న్యాయవాది వినోద్ షాహి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాయ్‌ను లక్నో సమీపంలోని అటవీ శాఖ గెస్ట్‌హౌస్‌కు తరలించినట్లు సమాచారం. తుది గడువు మార్చి 4 మధ్యాహ్నం 2 గంటలకల్లా సుప్రీం ముందు రాయ్‌ని హాజరుపరచాల్సిన బాధ్యత పోలీసులదేనని సీజేఎం ఆదేశించారు.



 వ్యాపారాలపై ప్రభావం చూపదు: సహారా

 రాయ్ అరెస్ట్ తరువాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే హడావుడిగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కుమారుడు సీమాంతో మాట్లాడారు. అధికారులకు తన తండ్రి పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. గ్రూప్ వ్యాపారాలపై ఆయన అరెస్ట్ ప్రభావం ఏదీ పడబోదని స్పష్టం చేశారు. నిజానికి రాయ్ సుప్రీం ముందు హాజరుకావడానికి 24న ఢిల్లీ వచ్చారని, అయితే తల్లి ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి లక్నో వెళ్లిపోయారని సీమాంతో తెలిపారు.



అరెస్ట్‌ను తప్పించుకోడానికి ఆసుపత్రిలో చేరిపోవాలని కొందరు సలహా ఇచ్చారని, అయితే ఇలాంటి డ్రామాలకు తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. కాగా సహారా మరో ప్రకటన విడుదల చేస్తూ, సెబీపై మళ్లీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దాదాపు రూ. 2,000 కోట్లు మినహా మొత్తం బకాయిల పునః చెల్లింపులు చేసేసినట్లు తెలిపింది. అయితే మదుపుదారులను గుర్తించడంలో సెబీ నెమ్మదిగా కదులుతోందని ఆరోపించింది.

 

 

 ఇప్పటివరకూ జరిగింది ఇదీ..

 

 సహారా గ్రూప్ కంపెనీలు... ఎస్‌ఐఆర్‌ఈసీ (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్), ఎస్‌ఐహెచ్‌ఐసీ (సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్) మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రూ. 24,000 కోట్లను వసూలు చేశాయన్నది ఈ కేసులో ప్రధానాంశం.

  ఇండోర్‌కు చెందిన రోషన్ లాల్ అనే ఇన్వెస్టర్ నాలుగేళ్ల క్రితం సెబీకి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైంది.

  న్యాయ ప్రక్రియ క్రమంలో 2012 ఆగస్టు 31న సుప్రీం రూలింగ్ ఇస్తూ, 2012 నవంబర్ ముగింపునకు ఈ మొత్తాలను 15 శాతం వడ్డీతో సెబీకి రిఫండ్ చేయాలని ఆదేశించింది.

  అయితే ఇందులో సంస్థ విఫలం కావడంతో గడువును పొడిగించింది. దీని ప్రకారం తక్షణం రూ.5,120 కోట్లు తక్షణం చెల్లించాలని, రూ. 10,000 కోట్లను 2013 జనవరికల్లా, మిగిలిన సొమ్మును 2013 ఫిబ్రవరి మొదటివారంలోపు చెల్లించాలని పేర్కొంది.



  2012 డిసెంబర్ 5న రూ.5,120 కోట్ల డ్రాఫ్ట్‌ను చెల్లించిన సహారా- ఆపై మొత్తాల చెల్లింపుల్లో విఫలమయ్యింది.



  కోర్టులో సెబీ దాఖలుచేసిన ధిక్కరణ పిటిషన్లను సహారా గ్రూప్ ఎదుర్కొంటోంది.



 సుప్రీం ఆదేశాల మేరకు రూ. 20,000 కోట్ల విలువైన సేల్ డీడ్స్‌నూ సహారాకు అందించింది. కేసు విచారణ నేపథ్యంలో సహారా చీఫ్ విదేశీ పర్యటనకు వీలులేదని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.



 ఒక దశలో డబ్బు తిరిగి చెల్లించేశామని చెప్పిన గ్రూప్, ఈ చెల్లింపులకు సంబంధించి అసలు తనకు అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలన్న బెంచ్ ఆదేశాలకు  తగిన విధంగా స్పందించలేకపోయింది.



సహారా అందించిన సేల్ డీడ్స్‌ను అమ్మకాలకు సెబీ చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ నెల 20న రూలింగ్ ఇచ్చింది. దీనితోపాటు 26న అంటే బుధవారం ధర్మాసనం ముందు రాయ్‌సహా రెండు కంపెనీల్లోని ముగ్గురు డెరైక్టర్లు స్వయంగా హాజరుకావాలని సైతం ఆదేశించింది.

 అయితే 25న మళ్లీ రాయ్ సుప్రీంను ఆశ్రయిస్తూ... తనకు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వాలని కోరారు. దీనికి సుప్రీం ససేమిరా అంది. 26న ముగ్గురు డెరైక్టర్లు హాజరయినా, రాయ్ కోర్టుకు రాలేదు.

 మరణశయ్యపై ఉన్న తల్లి పక్కనే ఉండడానికే ఆయన హాజరుకాలేకపోతున్నట్లు రాయ్ న్యాయవాది రామ్ జెత్మలానీ కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ఇచ్చింది.

 కేసు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.

 వ్యక్తిగతంగా హాజరుకానందుకు స్వయంగా క్షమాపణలు చెబుతూ 4న హాజరుకావడానికి సిద్ధమని పేర్కొంటూ ఫిబ్రవరి 27న రాయ్ సుప్రీంలో రికాల్ పిటిషన్ వేశారు. అరెస్ట్ వారంట్ రికాల్‌కు రాయ్ న్యాయవాదులు శుక్రవారం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

 దీనితో 65 సంవత్సరాల రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top