మరో 9 విదేశీ బ్రాంచ్‌లను మూసివేయనున్న ఎస్‌బీఐ

SBI to shut down nine foreign branches as part of rationalisation - Sakshi

న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరో తొమ్మిది విదేశీ బ్రాంచ్‌లను మూసివేయనుంది. ఇప్పటికే బ్యాంక్‌ గత రెండేళ్ల కాలంలో విదేశాల్లోని ఆరు బ్రాంచ్‌లలో కార్యకలాపాలకు స్వస్తి పలికింది. విదేశీ కార్యకలాపాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రిటైల్, డిజిటల్‌ బ్యాంకింగ్‌) ప్రవీణ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. కాగా ఎస్‌బీఐ 36 దేశాల్లో 190 బ్రాంచ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

‘విదేశీ భూభాగాల్లోని అన్ని బ్రాంచ్‌లు పూర్తిస్థాయి కార్యాలయాలు కాదు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో చిన్న బ్రాంచ్‌లతోపాటు రిటైల్‌ బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. వీటిని హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది’ అని గుప్తా వివరించారు. ‘బ్రాంచ్‌ల హేతుబద్ధీకరణ కొనసాగుతున్న ప్రక్రియ. వాణిజ్యపరంగా అనవసరం అయితే ఆ బ్రాంచ్‌లలో సేవలు కొనసాగించడం అవివేకం అవుతుంది’ అన్నారు.

బ్రాంచ్‌లను మూసివేయడమంటే కార్యకలాపాల నుంచి పూర్తిగా వైదొలగినట్లేనా? అనే ప్రశ్నకు.. తాము ఆ దేశాల నుంచి తప్పకున్నట్లు కాదని, అయితే చిన్న బ్రాంచ్‌లను మూసివేస్తామని, లేకపోతే రెండు లేదా మూడు బ్రాంచ్‌లను కలిపి ఒకటిగా చేస్తామని పేర్కొన్నారు.  ఈ ఆర్థిక సంవత్సరం దేశీయంగా దాదాపు 300–350 బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామని, వీటిల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తామని గుప్తా తెలిపారు. కాగా, ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ  బ్యాంకులు 35 విదేశీ బ్రాంచ్‌లను మూసివేశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top